రెండు తెలుగు రాష్ట్రాలలో వైకాపా ఉన్నప్పటికీ తెలంగాణాలో మాత్రం అది నామమాత్రంగా నడుస్తూ ఉంటుంది. తెలంగాణాలో దాని వ్యవహారశైలికి రకరకాల కారణాలు వినిపిస్తుంటాయి. కారణాలు ఏవైనప్పటికీ, తెలంగాణాలో ఆ పార్టీ తామరాకు మీద నీటి బొట్టులాగే వ్యవహరిస్తుంటుంది. కనుక ప్రజా సమస్యలపై అది మిగిలిన ప్రతిపక్ష పార్టీలలాగ పోరాడకపోయినప్పటికీ దానిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు కానీ అది ఎప్పుడైనా ప్రజాసమస్యల గురించి మాట్లాడితేనే ఆశ్చర్యం కలుగుతుంటుంది.
ప్రస్తుతం తెలంగాణాలో మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై తెలంగాణా ప్రభుత్వం-ప్రతిపక్షాల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. భూసేకరణని వ్యతిరేకిస్తూ ధర్నా చేస్తున్న నిర్వాసితులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో, అందుకు నిరసనగా ప్రతిపక్షాలు నిన్న మెదక్ జిల్లా బంద్ నిర్వహించాయి. ప్రొఫెసర్ కోదండరాం వంటి మేధావులు కూడా నిర్వాసితులకి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నారు.
ఇంత జరిగిన తరువాత వైకాపా తాపీగా స్పందించింది. నిజానికి అది స్పందించకపోయుంటేనే దానిని ఎవరూ ఈవిధంగా వేలెత్తి చూపేవారు కారేమో?ఆ పార్టీ తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు జి శ్రీకాంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడుతూ, “ముంపు గ్రామాలలో రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేయడాన్ని మా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. ఆ ప్రాజెక్టు డిజైన్ని తెలంగాణా ప్రభుత్వం ఎందుకు మార్చిందో చెప్పాలి. కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసేకరణ చట్టం అమలులో ఉండగా తెలంగాణా ప్రభుత్వం భూసేకరణ కోసం మళ్ళీ వేరేగా జి.ఓ. ఎందుకు జారీ చేసిందో చెప్పాలి. రైతులు భూములు ఇవ్వడానికి ఇష్టపడక ధర్నాలు చేస్తునప్పుడు ప్రభుత్వం చాలా హడావుడిగా ఆ గ్రామాలలోనే రిజిస్టార్ కౌంటర్లు ఏర్పాటు చేసి భూముల రిజిస్ట్రేషన్లు ఎందుకు చేస్తోంది?” అని ప్రశ్నించారు. వైకాపా ఎప్పుడూ రైతులకి అండగానే ఉంటుందని సమావేశాన్ని ముగించారు. బహుశః ఇంతటితో వైకాపా బాధ్యత ముగిసినట్లేనని అనుకోవాలేమో?
అమరావతి నిర్మాణం కోసం, మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం ఏపి ప్రభుత్వం భూసేకరణకి పూనుకొన్నప్పుడు, ఆ పార్టీ దానిని వ్యతిరేకిస్తూ చాలా తీవ్రంగా పోరాటాలు చేసింది…ఇంకా చేస్తూనే ఉంది. కానీ అదే తెలంగాణాలో మాత్రం చిన్న ఖండన ప్రకటనతో సరిపెట్టేసింది. చాలా విషయాలలో వైకాపా ఆ మాత్రం కూడా స్పందించదు కనుక అది కూడా చాలా గొప్ప విషయమేనని సరిపెట్టుకోవాలేమో!