తెలంగాణా ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో జరుగుతున్న అవినీతి, నిర్వాసితుల సమస్యలపై కాంగ్రెస్, తెదేపా, భాజపాలు ప్రభుత్వంతో చాలా గట్టిగా పోరాడుతున్నాయి. అవి ప్రజల తరపున నిలిచి ప్రభుత్వంతో పోరాటాలు చేస్తున్నప్పటికీ, ఆ పోరాటాలు తమ మనుగడని కాపాడుకోవడం కోసం చేస్తున్నవిగానే భావించవచ్చు. అంతగా పోరాడుతున్నా కూడా అవి తెరాస ధాటికి తట్టుకోలేక విలవిలలాడుతున్నాయి. తెలంగాణాలో వైకాపా కూడా ఉన్నప్పటికీ అది ఏనాడూ ఈవిధంగా ప్రజాసమస్యలపై పోరాడిన దాఖలాలు లేవు. తన ఉనికిని చాటుకొనే ప్రయత్నాలు చేయదు. ఎప్పుడైనా షర్మిల తెలంగాణాలో పరామర్శ యాత్రలో, భరోసా యాత్రలో చేసినప్పుడో లేదా ఎన్నికల సమయంలో మాత్రమే వైకాపా ఉనికి కనబడుతుంటుంది తప్ప మిగిలిన సమయంలో రాష్ట్రంలో అ పార్టీ ఉందో లేదో ఎవరికీ తెలియదు. దాని నిశబ్దానికి కారణాలు అందరికీ తెలుసు.
ఈ నేపధ్యంలో నేడు మెదక్, ఖమ్మం జిల్లాలకి చెందిన వైకాపా నేతలు హైదరాబాద్ లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయమైన లోటస్ పాండ్ లో సమావేశం కాబోతున్నారనే వార్త చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ రెండు జిల్లాలో తమ పార్టీ పరిస్థితిని సమీక్షించుకొనేందుకు వారు సమావేశం అవుతున్నట్లు సాక్షి పేర్కొంది. పార్టీ తరపున నిత్యం ఏవైనా కార్యక్రమాలు చేపడుతున్నట్లయితే, ఇటువంటి సమావేశాలలో వాటిలో మంచి చెడ్డలని సమీక్షించుకొని తమ పనితీరుని ఇంకా మెరుగుపరుచుకొని తద్వారా జిల్లాలలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని చెప్పుకోవచ్చు. అసలు వైకాపా తెలంగాణాలో తన ఉనికిని చాటుకొనేందుకు చిన్న ప్రయత్నం కూడా చేయనప్పుడు ఈ సమీక్షా సమావేశాలు ఎందుకో? బహుశః ఈవిధంగా తమ ఉనికిని చాటుకొనే ప్రయత్నం చేస్తున్నారేమో?