కరోనా వైరస్ ఇండియా క్రికెట్ హోంగ్రౌండ్స్కు చాలా నష్టం చేస్తోంది. మధ్యలో ఆగిపోయిన ఐపీఎల్ దుబాయ్‌కి షిప్ట్ అయిపోయింది. ఇప్పుడు ప్రపంచకప్ కూడా.. దుబాయ్‌కే చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారత్‌లో టీ ట్వంటీ ప్రపంచకప్.. అక్టోబర్-నవంబర్ నెలల్లో జరగాల్సి ఉంది. ఈ మెగా టోర్నీకి ఏర్పాట్లు చాలా ముందుగానే ప్రారంభించాలి. ఈ అంశంపై ఐసీసీ.. పదే పదే బీసీసీఐపై ఒత్తిడి తెస్తోంది. ఇంత కాలం నాన్చిన బీసీసీఐ ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము భారత్‌లో టీ 20ప్రపంచకప్‌ను నిర్వహించలేమని చావు కబురు చల్లగా చెప్పింది. అప్పటికి పరిస్థితులు మెరుగుపడతాయని అనుకుంటే.. ఒక వేళ.. ధర్డ్ వేవ్ వస్తే.. మొత్తం ప్రపంచకప్ షెడ్యూల్ అప్సెట్ అవుతుంది.
ఇలాంటిపరిస్థితి రాకుండా ఉండాలంటే… ప్రపంచకప్‌ను కూడా తరలించడం మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రపంచకప్‌లో మొత్తం పదహారు జట్లు పాల్గొంటాయి. ఎలా లేదన్న టీములతో పాటు.. సపోర్టింగ్ స్టాఫ్ తో పాటు.. ఒక్కో జట్టులో కనీసంయాభై మంది ఉంటారు. ఐపీఎల్లో ఎనిమిది జట్లే ఉన్నా.. కరోనా బారిన పడ్డారు. ఈ పరిణామాలతో ఐసీసీకి ఇప్పుడు ప్రత్యామ్నాయ వేదిక ఎంచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తటస్థ వేదిక అయిన దుబాయ్‌కే ఐసీసీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిపోయిన ఐపీఎల్ కూడా అక్కడే జరగనుంది. అయితే ఆతిధ్య హక్కులు భారత్వికాబట్టి… వెన్యూ ఎంపికలోభారత్ అభిప్రాయంకూడా తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ మేరకు గల్ఫ్ దేశాలలోనిర్వహిస్తే అభ్యంతరం లేదని ఐసీసీకి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఎలా చూసినా… ఇక టీ 20 ప్రపంచకప్ మాత్రం ఇండియాలో జరిగే అవకాశం లేదు. దుబాయ్‌లో జరగడానికే ఎక్కువ చాన్సులున్నాయి. అక్కడైతే.. కరోనా ఎంత తీవ్రంగా ఉన్నా.. ఇబ్బందులు రావని… ఖాళీగా స్టేడియాలను ఉంచి అయినా ప్రపంచకప్ నిర్వహించవచ్చని అనుకుంటున్నారు. ఇప్పటికే టోర్నీలు రద్దవడం వల్ల భారీగా నష్టపోయిన బీసీసీఐకి… ప్రపంచకప్ కూడా రద్దయితే ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. అందుకే దుబాయ్‌కే ఓటేసినట్లుగా తెలుస్తోంది.