అందరూ శాకాహారులే.. కానీ బుట్టలో చేపలు మాత్రం మాయం అయిపోయినట్లు.. నువ్వు రాజకీయం చేస్తున్నావంటే.. నువ్వు రాజకీయం చేస్తున్నావంటూ… ఆంధ్రప్రదేశ్లోని అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. అసలు రాజకీయం చేయడం తప్పు అని వారు ఎందుకు అనుకుంటున్నారో… రెండు పార్టీలూ తాము చేసేది రాజకీయం కాదని చెప్పుకోడవానికి ఎందుకు తాపత్రయపడుతున్నాయో.. ఎవరికీ అర్థం కాని విషయం . అధికార, ప్రతిపక్ష పార్టీలకు రెండూ రాజకీయ పార్టీలు. రాజకీయం కోసమే.. వాటిని ప్రారంభించారు. వాటిలో ఉన్న నేతలందరూ రాజకీయమే చేస్తూంటారు. కానీ.. మీరు రాజకీయం చేస్తున్నారంటే.. ఉలిక్కిపడి.. లేదు లేదు.. మేం రాజకీయం చేయడం లేదంటున్నారు. ఎందుకిలాంటి పరిస్ధితి వచ్చింది..?
ఏపీ అధికారపార్టీపై దూకుడుగా టీడీపీ విమర్శలు..!
కరోనా వైరస్ దేశంలోకి కాస్త లేటుగానే వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోకి ఇంకా లేటుగా వచ్చింది. అసలు ఆంధ్రప్రదేశ్లోకి రాదని.. ప్రభుత్వ పెద్దలు గట్టిగా నమ్మారు. కానీ వచ్చింది. వస్తే వచ్చింది కానీ.. మరీ కమ్మేయదని అనుకున్నారు. కానీ.. కమ్మేసింది. ఇప్పుడు.. కిందా మీదా పడుతున్నారు. కరోనా పెద్ద విషయం కాదని.. మొదట్లో చెప్పేందుకు… ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నించిన అధికార పార్టీ.. ఇప్పుడు.. కరోనాను ఎలా ఎదుర్కోవాలన్నదానిపై.. అనేక ప్రయోగాలు చేస్తోంది. ఈ క్రమంలో… ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చాలా ఈజీగా దొరికిపోతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రెస్మీట్లు పెట్టలేకపోవడం.. ఆయన సరిగ్గా తన భావాలను వ్యక్తం చేయలేకపోవడంతో.. సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతిపరులు ట్రోల్ చేయడానికి అవకాశం ఏర్పడింది. చివరికి రికార్డింగ్ ప్రెస్మీట్లకే పరిమితం కావాల్సి వస్తోంది. ఇప్పుడు అవి కూడా లేవు. గతంలో కరోనా గురించి అన్న మాటలు.. ఇప్పుడు అంటున్న మాటలు.. చేస్తున్న చేతలు అన్నీ కలగలిపి.. తెలుగుదేశం పార్టీకి కడపులో చల్ల కదలకుండా… ప్రభుత్వ తీరును ప్రజల్లో ఎక్స్పోజ్ చేసే అవకాశం దక్కింది. దాంతో వారు తమకు చేతనైన రాజకీయం తాము చేస్తున్నారు.
రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ నేతల విమర్శలు..!
అదే సమయంలో… ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒక్క కరోనాపైనే దృష్టి పెట్టిందా అంటే లేదు. కరోనాపై ఎంత దృష్టి పెట్టిందో.. ఇతర అంశాలపైనా అదే స్థాయిలో రాజకీయం చేస్తోంది. కరోనా లాక్ డౌన్ ప్రారంభమైన తర్వాత యూనివర్శిటీల పాలక మండళ్లను నియమించారు. అందులో రెడ్డి సామాజికవర్గానికే సగానికిపైగా పదవులు దక్కాయి. దీనిపై విమర్శలు వచ్చేసరికి.. కులం పేరుతో ఎదురుదాడికి దిగిపోయారు వైసీపీ నేతలు. ఇక కేంద్ర సాయం పేరుతో చేసిన రాజకీయం అంతా ఇంతా కాదు. కేంద్రం ఇచ్చిన రూ. వెయ్యి పంపిణీ నుంచి పప్పు ఉప్పుల పంపకాల వరకు ప్రతి చోటా రాజకీయ గలాటా జరుగింది. కందిపప్పు ప్యాకెట్లను చించి కందిపప్పు కొట్టేశారని.. నిబంధనలు అతిక్రమించి, గుంపులు గుంపులుగా మాస్క్లు లేకుండా తిరుగుతూ వైసీపీ నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తున్నారని.. విపక్షం పదే పదే ఆరోపిస్తోంది. కరోనా సాయం కింద.. ప్రభుత్వం పంపిణీ చేసిన వెయ్యి రూపాయల్ని వైసీపీ నేతలు పంచడంపైనా విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. దానికి అధికారపక్షం కూడా కౌంటర్ ఇస్తోంది పంచితే తప్పేమిటని ప్రశ్నిస్తోంది.
మాస్కుల సమస్య దగ్గర్నుంచి రాజధాని భూముల వరకూ అన్నీ రాజకీయమే..!
ప్రస్తుతం కరోనా సమయంలో.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అదే పనిగా విమర్శలు గుప్పిస్తున్నాయి విపక్షాలు. వైద్యులకు అందాల్సిన మాస్కులు, శానిటైజర్లు వీవీఐపీలకు అందుతున్నాయని, సగటు జనానికి అందడం లేదనే ఆరోపణలు అనేక రాష్ట్రాల్లో వస్తున్నాయి. ఇలాంటి రాజకీయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అగ్రస్థానంలో ఉంది. ఏపీలో ఇలా జరుగుతోందంటూ.. కొంత మంది ఢిల్లీలో ఉండే వారు కూడా.. మీడియా వార్తల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వైద్యుడు సుధాకర్ అడిగిన ప్రశ్నలకు సమాదానం ఇవ్వని ప్రభుత్వం ఆయను సస్పెండ చేసింది. మరో రకమైన చర్చకు కారణం అయింది. ఇప్పటివరకు జరిగిన అమరావతి పోరాటానికి రైతులు విరామం ఇవ్వకతప్పలేదు. రైతులు పోరాటం కొనసాగిస్తున్నామని చెబుతూ.. ఇళ్ళ నుంచి సంఘీభావం.. ప్రకటిస్తున్నారు. అయితే రైతులపై ప్రభుత్వ ఎదురుదాడికి మాత్రం విరామం లేదు.. రాజధాని భూముల్లో ఇళ్ళ స్థలాలకు హైకోర్టు బ్రేక్ వేసింది. అయినా… ప్రభుత్వం వెక్కి తగ్గడం లేదు. సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ వేసేందుకు సిద్ధపడుతోంది. అలా పిటిషన వేస్తామని.. మీరు పనులు కొనసాగించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసేసింది. అలాగే లే అవుట్లు వేసేందుకు అధికారుల్ని పంపుతోంది. . ఇలాంటివన్నీ లాక్డౌన్ సమయంలో జరుగుతున్నవే.. కరోనా ఎంతలా కమ్ముకొస్తున్నా.. ఏపీలో రాజకీయం మాత్రం తన పని తాను చేసుకుపోతోంది.
అధికారపక్షం పాలన చేయాలి.. తప్పులు చేస్తే విపక్షం నిలదీయాలి.. అదే రాజకీయం..!
అధికారపక్షం ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు.. విపక్షానికి కావాల్సినంత పని ఉంటుది. పేదలకు సాయం విషయంలోనో, కరోనా నివారణ కోసం ప్రభుత్వం సరిగా స్పందించనప్పుడో… విపక్షం ఇలా మాట్లాడుతుంది. మాట్లాడాలి కూడా. అయితే.. ఇలాంటి సందర్భాల్లో రాజకీయం మాత్రం డామినేట్ చేస్తూనే ఉంటోంది.. విపక్షం కోణం నుంచి చూస్తే కొన్ని కదిలించే విషయాలు ఉంటున్నాయి. కరోనా కారణంగా అనేక రాష్ట్రాల్లో తెలుగువాళ్లు ఇరుక్కుపోయారు. వారికి నిత్యావసర సరుకులు కూడా దొరకని పరిస్థితి. వారి కోసం చంద్రబాబు తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. దాని ఫలితంగా వారికి సాయం అందింది. నిజానికి ప్రభుత్వ యంత్రాంగం ఇలాంటివి పట్టించుకోవాల్సి ఉంటుంది. కానీ పట్టించుకోకపోవడం వల్లే విపక్షాలు అడ్వాంటేజ్ తీసుకుంటున్నాయి.. ప్రజలకు అంతో ఇంతో మేలు చేస్తున్నాయి.
రాజకీయం చేయడాన్ని తప్పుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు..?
ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల నేతలు రాజకీయమే చేస్తున్నారు. అందులో తప్పు లేదు. రెండు పార్టీల్లోనూ ఉన్న వారు రాజకీయ నేతలు. కానీ తాము రాజకీయం చేస్తున్నామనేసరి.. వారెందుకు తప్పు చేసినట్లుగా కుంగిపోతున్నారో.. రాజకీయం చేస్తున్నారనే విమర్శలనే ఎదుకు ఎదుటివారిపై ప్రయోగిస్తున్నారో అర్థం కాని విషయం. రాజకీయం అనేది అంత బూతుపదం ఎందుకయిందో.. ఆ రాజకీయ నేతలే విశ్లేషించుకోవాలి. అధికారపార్టీ ప్రజల కోసం పని చేయాలి. ప్రతిపక్షం.. అధికార పార్టీ చేసే తప్పులను ఎత్తి చూపాలి. అలా అయితేనే.. ప్రజా స్వామ్య రాజకీయం అవుతుంది. ఆ లెక్కన చూస్తే.. ఏపీలో రెండు పార్టీలు.. తమ బాధ్యతలు సమక్రంగానే నిర్వర్తిస్తూ.. రాజకీయం చేస్తున్నాయని అనుకోవాలి. కానీ రాజకీయ చేయడం తప్పు ఎందుకవుతోంది..? రాజకీయం చేయడం రాజకీయ నేతల్లో వేరే అభిప్రాయం ఉందా..?