రాజకీయాలు డైనమిక్ గా ఉంటాయి. ఇవాళ ఉన్న పరిస్థితి రేపు ఉంటుందని అనుకోవడం రాజకీయ అమాయకత్వం. ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఏం చేసినా రేపు వారిలో సగమైనా జేజేలు కొట్టకపోతారా అని ప్రజా కంటక పనులు చేస్తే.. బటన్ నొక్కి ఇంటికి పంపేస్తారు. ఆ మార్పు రావడానికి ఏళ్లు ..పూళ్లు అక్కర్లేదు. కొంత సమయం చాలు. రాజకీయాల్లో ఈ కొంత సమయం ఒక రోజా.. ఒక నెలా.. ఒక ఏడాది అనేది చెప్పలేం. అది ఒక నిమిషం కూడా కావొచ్చు. అందుకే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టం. ఈ నిజాన్ని నిర్భయంగా గుర్తుంచుకుని రాజకీయాలు చేసే వాడికే భవిష్యత్ ఉంటుంది. కానీ.. తనను ప్రజలు ఓ సారి అభిమానించారని ఇక జీవితాంతం అభిమానించేటట్టు చేసుకోగలనని విర్రవీగేవారికి మాత్రం పతనం.. విజయం వచ్చినంత వేగంగా పతనం కూడా వస్తుంది. మార్పు ప్రారంభమైనప్పుడే ఆ రాజకీయ నేత గుర్తించగలిగితే కొంత డ్యామేజీతో బయటపడవచ్చు..కానీ అధికారం తలెకెక్కించుకున్న వారయితే.. ఇలాంటివి పట్టించుకోరు. పరిస్థితుల్ని సమీక్షించుకోరు. నాడు..నేడు అని వెనక్కి తిరిగి చూసుకోరు., ఎప్పుడు చూసుకుంటారు అంటే.. పూర్తిగా చేతులు కాలిన తర్వాత. ఏపీలో అధికార వైఎస్ఆర్సీపీకి ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన పార్టీ… జగన్ ఒక్క సారి చెబితే వెయ్యి కాదు.. లక్ష సార్లు చెప్పినట్లుగా అన్న పార్టీలో ఇప్పుడు నెలకొన్న పరిస్థితులే .. మారిన వాతావరణాన్ని సూచిస్తున్నాయి. మరి వైఎస్ఆర్సీపీ పెద్దలు తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే సందేహం.
పేకమేడలా వైసీపీ .. పెద్దారెడ్లు అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నారా ?
2019 ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఎవరికైనా.. తెలుగుదేశం పార్టీ మళ్లీ కోలుకోవాలంటే చాలా కాలం పడుతుందని అనుకున్నారు. జనం కూడా అదే అనుకున్నారు. వైసీపీ నేతలూ అదే అనుకున్నారు. టీడీపీ నేతలూ అదే అనుకున్నారు. ఆ చాలా కాలం అంటే.. మరో సారి జగన్ గెలుస్తారేమో కానీ.. ఆ తర్వాతైనా గెలుస్తాము కదా అని..ఆశలు పెట్టుకున్న వారు మాత్రమే టీడీపీలో ఉన్నారు. మిగతా వారంతా ఏదో ఓ దారి చూసుకున్నారు. దానికి తగ్గట్లుగానే వైసీపీ ఉంది. అటు ప్రజలు.. ఇటు అధికారుల్లో అదే ఇమేజ్ ఉంది. వైసీపీకి తిరుగు లేదని.. ఆ పార్టీకి ఎదురు తిరగడం మంచిది కాదని అనుకుంటూ వస్తున్నారు. అందుకే.. అధికారులు ఎప్పుడూ ఏ పార్టీకి చేయనంత ఊడిగం ఇటీవలి వరకూ.. వైసీపీకి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల విషయంలో ఏకంగా ఎన్నికల కమిషనర్‌నే ఉద్యోగులు ధిక్కరించారంటే.. ఆయనపైనే తిరుగుబాటు చేశారంటే.. చిన్న విషయం కాదు. ఉద్యోగులు మాత్రమే కాదు..అధికారులు కూడా. పోలీసులు ప్రైవేటు సైన్యంలా మారారు. ఇతర అధికారులు టీడీపీని వేధించడమే పనిగా పెట్టుకున్నారు. అన్ని శాఖల్లో కొన్ని కులాల వారికి పోస్టింగ్‌లు దక్కపోయినా మాట్లాడే పరిస్థితి. పార్టీలోనూ అంతే.. వైసీపీ పార్టీలో జగన్ ఓ మాట అంటే దాన్ని జవదాటే వాళ్లే లేరు. ఎమ్మెల్యేలు అయినా అంతే. ఇప్పటి వరకూ కనీసం జగన్ అపాయింట్ మెంట్ దొరకని ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కానీ ఎవరూ ఎప్పుడూ నోరెత్తలేదు. పార్టీపై అంత పట్టు ఉండేది. కానీ ఇప్పుడు మవుతోందో.. కనీసం వైసీపీ ముఖ్య నేతలు రివ్యూ చేసుకుంటున్నారా ?
పార్టీపై జగన్ రెడ్డి పట్టు జారిపోతోందని గుర్తించే స్థితిలో ఉన్నారా ?
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరు ? రాజారెడ్డి కాలం నుంచి ఆ పార్టీకి విధేయుడు. కానీ ఇప్పుడేం జరిగింది..?. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు టీడీపీలోకి రావాలని ఆఫర్ ఇచ్చారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉంది. ఆయనపై బెట్టింగ్ కేసులు కూడా ఉన్నాయి. కానీ ఆయన వైసీపీకే కట్టుబడి ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా తన రాజకీయం వైసీపీ తరపునే అనుకున్నారు. తనను బెట్టింగ్ కేసుల్లో పోలీసులు వేధిస్తున్నారని.. కంట తడి కూడా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన వైసీపీ అధికారంలో ఉంటే.. టీడీపీ తరపున పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉంది. ఇప్పుడే కోటంరెడ్డి ఇలా బయటపడ్డారంటే.. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో ఎవరికైనా అర్థం అయిపోతుంది. వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడైన కోటంరెడ్డినే అవమానాల పాలు చేసిఇక ఆ పార్టీలో ఉంటే ఎంత లేకపకోతే ఎంత అనేలా చేశారంటే.. ఇక రాజకీయ అవసరాల కోసం పార్టీలో చేరిన ఆనం రామనారాయణరెడ్డి లాంటి వారు ఎలా ఉంటారు ? . అదే జరుగుతోంది. ఇక్కడ విషయం ఒక్క కోమటిరెడ్డి లేదా ఆనం రామనారాయణరెడ్డి అని కాదు. అసలు వారు తిరుగుబాటు చేయడానికి దారి తీసిన పరిస్థితులే కారణం. రాజకీయ పార్టీని ప్రైవేటు లిమిటె్డ కంపెనీలా నడుపుకుని … ఎమ్మెల్యేలు అంటే.. తన కింద పని చేసే మనుషులన్నట్లుగా ట్రీట్ చేయడం వల్ల తలెత్తిన పరిణామాలు ఇవి. వారు వైసీపీ జెండాతోనే గెలిచి ఉండవచ్చు కానీ.. వారికి ప్రజాబలం లేదని.. జగన్ ఫోటో పెట్టుకుంటే మాత్రమే గెలుస్తారని.. అందుకే వారిని కాలి కింద చెప్పుల్లా చూస్తానంటే..ఊరుకుంటారా? కోటంరెడ్డి విషయంలో అదే జరిగింది. ఆనం రామనారాయణరెడ్డి విషయంలో అదే జరిగింది. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి విషయంలనూ అదే జరుగుతోంది. వీరు బయటపడ్డారు.. బయటపడటానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఇంకా ఎన్నికలకు ఏడాదికిపైగా సమయం ఉన్నందున చాలా మంది.. ధైర్యం చేయడం లేదు… కానీ ముందు ముందు చాలా మంది బయటకు వస్తారు. దీని వెనుక టీడీపీ ఉందని గొంతు చించుకున్నా ప్రయోజనం ఉండదు.ఎందుకంటే… దీని వెనుక ఉన్న వైసీపీ పెద్దలే.. వారి వ్యవహారశైలే. ఈ పరిణామాల్ని టీడీపీ వారికి అనుకూలంగా మల్చుకుంటే అది వైసీపీ ఇచ్చిన అవకాశమే.
అధికారులూ అడ్డం తిరుగుతున్నారు.. గుర్తిస్తున్నారా వైసీపీ పెద్దలూ !
నిన్నటిదాకా వైసీపీ పెద్దలకు అధికారులు గులాం కొట్టారు. ఏం చెబితే అది చేశారు. కానీ ఇప్పుడు మాత్రం.. ప్రభుత్వ నిర్వాకాల గురించి పదే పదేమీడియాకు లీకులు ఇస్తున్నారు. చివరికి ఇంటలిజెన్స్ రిపోర్టులు కూడా ప్రో టీడీపీ అని వైసీపీ ప్రచారం చేసే వారికి చేరిపోతున్నాయంటే.. పరిస్థితి అర్థం కావడం లేదా ? అధికారుల్లో పట్టు ఉన్నప్పుడు ఎలాంటి పరిపాలన నడిచింది.. ఇప్పుడు ఎలాంటి పరిపాలన నడుస్తోంది.. అనేది ఒక సారి ప్రభుత్వ పెద్దలు విశ్లేషణ చేసుకుంటే.. తాము ఎక్కడ నుండి జారి ఎక్కడికి వచ్చామో అర్థం అవుతుంది. రాజకీయ నేతలు ఐదేళ్లకోసారి మారతారు..కానీ అధికారులు … ఉద్యోగులు శాశ్వతంగా ఉంటారు. వారిని భయపెట్టి.. పోస్టింగ్‌లు ఆశ పెట్టి కొన్నాళ్లు చట్ట విరుద్ధంగా పని చేయించుకోవచ్చు..కానీ ఈ బొక్కలన్నీ తెలిసి ఉండేది వారికే. రేపు వారే అడ్డం తిరిగితే మొదటికే మోసం వస్తుంది. అందుకే ఏ రాజకీయ పార్టీ అయినా అధికారుల్ని .. గీత దాటనంత వరకే వాడుకునేది. కానీ వైసీపీ మాత్రం.. తమకు అధికారం శాశ్వతం అన్నట్లుగా చెలరేగిపోయింది. ఆ దుష్పరిణామాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీలో అలజడి రేగడానికి ప్రధాన కారణం అధికార వర్గాలే. సీఎం జగన్ ఎక్కువగా నమ్మి.. తన పార్టీ జుట్టును అధికారుల చేతుల్లోనే పెట్టారు. ఇప్పుడు అదే అడ్వాంటేజ్ గా వైసీపీని ఎలా బలహీనం చేయాలో అలా చేస్తున్నారు. జరుగుతున్న పరిణామాల్లో నేరుగా అధికారుల ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంటలిజెన్స్ చీఫ్.. మేలు చేయాలనుకుంటే..ఇలా చేయరు. అందరికీ తెలిసేలా ట్యాపింగ్ చేయరు. కానీ ఆయన చేశారు. అది ఎమ్మెల్యేల్లో భయం కలిగించడానికని ప్రభుత్వ పెద్దలకు ఆయన చెప్పవచ్చు కానీ.. ఆయన చేసింది.. జగన్ అంటే ప్రాణం పెట్టే వారిని అవమానించడం. ఆ ఫలితమే..ఇప్పుడు వైసీపీకి వారుతున్న బీటలు.
అప్పట్లో నోరు మెదిపేవారుండరు..ఇప్పుడు నేరుగా విమర్శిస్తున్నారు !
సీఎం జగన్మోహన్ రెడ్డిని పార్టీలో ఒక్క మాట అనే వారు ఉండరు. సంపూర్ణ విధేయత్వం కనిపించేది. కానీ ఇప్పుడేం జరుగుతోంది. నిన్నటికి నిన్న గన్నవరంలో వైసీపీ ప్రారంభించినప్పటి నుండి ఆ పార్టీలో ఉన్న దుట్టా రామచంద్రరావు అనే నేత.. వైసీపీ కోసం అమెరికా నుంచి వచ్చి వల్లభనేని వంశీపై పోరాడిన యార్లగడ్డ వెంకట్రావు ఇద్దరూ కలిసి వంశీ , కొడాలినే కాదు చివరికి జగన్ ను కూడా విమర్శించారు. ఆయనను విలన్ గా తీర్పిచ్చేశారు. క్లైమాక్స్ లో హీరోనే గెలుస్తాడని కూడా జోస్యం చెప్పుకున్నారు. ఇది వీడియో రికార్డింగ్ బయటకు వచ్చింది కాబట్టి అందరికీ తెలిసిపోయింది. కానీ.. రహస్యంగా ఎంతో మంది ఎమ్మెల్యేల ఫోన్లు వింటిన ఇంటలిజెన్స్‌కు ఎంత మంది అనుకుంటున్నారో స్పష్టంగా తెలుసు. వారు అంతా ఈ విషాయలను సీఎం జగన్ కు చెబుతారో లేదో.. కానీ గ్రౌండ్లో జగన్ పార్టీపై పట్టు ఎలా కోల్పోయారో మాత్రం స్ఫష్టంగా అందరికీ అర్థమవుతూనే ఉంది.
ఇప్పటికే చలి తెలియాలి మాస్టారూ…లేకపోతే తర్వాత నిండా మునిగాక చలేంటి అనుకునే పరిస్థితే !
రాజకీయాల్లో ఎప్పటికప్పుడు.. నిర్ణయాలను..ఎదురవుతున్న పరిణామాలను .. పార్టీ పరిస్థితిని సమీక్ష చేసుకోవాలి. దిగజారిపోతూంటే.. మెరుగుపడటానికి ప్రయత్నంచేయాలి. గడప గడపకూ మన ప్రభుత్వం ద్వారా చేస్తోంది అదే కదా..అని అనుకుంటే.. అంత కంటే అమాయకత్వం ఉండదు. ప్రజల కంటే ముందు పార్టీ కీలకం. పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే కాదు. అందరూ కలిస్తేనే పార్టీ. ఈ విషయం తెలియకుండా రాజకీయాల్లో ఉండలేరు. కొన్నాళ్లుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వ పరంగా జరుగుతున్న పరిణామాలను విశ్లేషించుకుంటే ప్రభుత్వ పెద్దలకు తాము ఎంత తప్పు చేశామో అర్థం అవుతుంది. వాటిని దిద్దుకునే ప్రయత్నం చేస్తారు. నిజానికి ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. దిద్దుకోలేనన్ని తప్పులు వారు చేశారు. కానీ ఇప్పటికీ సమయం ఉంది కాబట్టి.. సర్దుబాటు చేసుకోవచ్చు. ప్రజా తీర్పుకు వెళ్లే ముందు.. తప్పొప్పుల్ని సమీక్షించుకోవడం తప్పేం కాదు. కానీ.. అధికారం అనే మత్తు ఆవహించిన వారికి.. తాము కరెక్టే చేస్తున్నామని ఎదుటి వారు చేసేది మాత్రమే తప్పు అని అనిపిస్తుంది. దాన్నే అధికార మత్తు కళ్లను కప్పేయడం అంటారు. ఇది ఎప్పుడు దిగుతుందంటే… అధికారం పోయాకే దిగుతుంది. అప్పటి వరకూ… ఎవర్నీ లెక్క చేయరు.. ఎలాంటి పరిణామాల్నీ పట్టించుకోరు. తమ తప్పుల్నీ సరి చేసుకోరు. వైసీపీలో ఇప్పుడు అదే జరుగుతోంది. తమ తప్పులకు టీడీపీ కారణం అని తమను తాము మోసం చేసుకుంటున్నారు. చివరికి ఏం మిగులుతుందో.. అధికారం పోయాకే తెలుస్తుంది !