తెలుగు360 జిల్లాల వారీగా అందిస్తున్న సర్వేల్లో ఈ రోజు.. టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు ఫలితాలను చూద్దాం. ఇప్పటి వరకూ.. పార్టీల అభిమానాలకు అతీతంగా ప్రజాభిప్రాయానికే ప్రాముఖతనిచ్చి.. సర్వేలు ఇవ్వడం జరిగింది. తమ అభిమాన పార్టీకి వ్యతిరేకంగా వస్తే ఒకలా.. అనుకూలంగా వస్తే మరోలా స్పందించడం… ఆయా రాజకీయ పార్టీ కార్యకర్తల లక్షణం. అలాంటి స్పందనలకన్నా.. ప్రజాభిప్రాయాన్నే.. ఎక్కువగా పరిగణనలోకితీసుకుంటూ… సర్వేను ప్రకటిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో మొత్తం పధ్నాలుగు స్థానాలున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ 6, వైసీపీ 8 సీట్లు గెలుచుకున్నాయి. ఐదేళ్లలో రాజకీయ పరిస్థితులు మారాయి. చిత్తూరు నుంచి గత ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన మాజీ ఎంపీ డీకే ఆదికేశవులునాయుడు సతీమణి ఈ సారి రాజంపేట ఎంపీ బరిలో నిలిచారు. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ బరిలో ఉన్నారు. వైసీపీ తరపున.. గత ఎన్నికల్లో ఓడిపోయిన జంగాలపల్లె శ్రీనివాసులు పోటీ చేస్తున్నారు. పోటీ హోరాహోరీగా ఉన్నట్లుగా అనిపించినా.. చిత్తూరులో గట్టి పట్టు ఉన్న సీకే బాబు టీడీపీలో చేరారు. ఆయనతో విబేధాలను నేతలందరూ పక్కన పెట్టి పని చేస్తున్నారు. వైసీపీలో వర్గ విబేధాలతో కొంత మంది సైలెంట్‌గా ఉన్నారు. ఇక్కడ టీడీపీకి ఈ సారి కూడా క్లియర్ అడ్వాంటేజ్ ఉంది. పూతలపట్టు నియోజకవర్గంలో.. సిట్టింగ్ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ని పక్కనపెట్టి వైసీపీ ఎం.బాబుకు టికెట్ ఇచ్చింది. టీడీపీ అభ్యర్థిగా లలితకుమారి ఉన్నారు. ఈమె రెండు సార్లు స్వల్ప తేడాతో ఓడిపోయిన సానుభూతి ఉంది. అలాగే టిక్కెట్ ప్రకటించే ముందు జరిగిన వ్యవహారాలుకూడా ఆమెకు సానుభూతి తెచ్చి పెట్టాయి. ఇక వైసీపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పట్ల జగన్ వ్యవహరించిన తీరు.. అక్కడ దళిత వర్గాల్లో వ్యతిరేకత తెచ్చింది. టీడీపీ అభ్యర్థిగా లలిత కుమారి అసెంబ్లీలో అడుగు పెట్టే అవకాశం కనిపిస్తోంది. తిరుపతికి పక్కనే ఉన్న చంద్రగిరి స్థానంలో పూర్వ వైభవం సాధించడానికి టీడీపీ అన్ని ప్రయత్నాలు చేసింది. టీడీపీ తరపున పులివర్తి నాని, వైసీపీ తరపున చెవిరెడ్డి పోటీ చేస్తున్నారు. చెవిరెడ్డి వ్యవహారశైలి… ప్రజల్లో వ్యతిరేకత పెంచింది. ఏడాది ముందు నుంచి విచ్చలవిడిగా చెవిరెడ్డి ఖర్చు పెడుతున్నారు. ఇది ప్రజల్లో వ్యతిరేకత పెరగడానికి కారణం అయింది. గల్లా వర్గం మొత్తం టీడీపీ అభ్యర్థికి సహకరిస్తోంది. దీంతో చంద్రబాబు సొంత ఊరు ఉన్న నియోజకవర్గంలో.. టీడీపీ జెండా మరోసారి ఎగిరే అవకాశం ఉంది.
కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడోసారి బరిలోకి దిగారు. చంద్రబాబు ఇంతవరకూ ఇక్కడ ప్రచారానికి రాకున్నా పార్టీ శ్రేణులు విస్తృతంగా తిరుగుతున్నాయి. అభివృద్ధి పనులపై ప్రజల్లో సానుకూలత ఉంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి ఉన్నారు. కానీ ఆయన అనారోగ్యంతో ఆసుపత్రిలోనే ఉన్నారు. ఈ సారి అక్కడ టీడీపీ మెజార్టీ భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుప్పంని ఆనుకుని ఉండే పలమనేరులో గత ఎన్నికల్లో వైసీపీ తరఫున నెగ్గిన అమర్నాథ్రెడ్డి తరువాత టీడీపీలో చేరి మంత్రి అయ్యారు. నిజానికి ఆయన మొదటి నుంచి టీడీపీలో ఉన్న నేత. టీడీపీ తరపున ఇన్చార్జ్ గా వ్యవహరించిన సుభాష్‌చంద్రబోస్‌ని కలుపుకొని అమర్నాథ్రెడ్డి గట్టిగా ప్రచారం చేస్తున్నారు. పోటీ హోరాహోరీగా ఉంది. వైసీపీ అభ్యర్థికి వెంకటేగౌడకు పెద్దిరెడ్డి అండగా ఉన్నారు. కానీ కొంత మంది సహకరించడం లేదు. హోరాహోరీ పోరులో… అమరనాథరెడ్డి గట్టెక్కడం కష్టమనేనన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తోంది. పుంగనూరు నియోజకవర్గంలో టీడీపీ తరపున అనీషారెడ్డి, వైసీపీ తరపున పెద్దిరెడ్డి బరిలో ఉన్నారు. జనసేన అభ్యర్థిగా రామచంద్రయాదవ్ బరిలో ఉన్నారు. ఆయన సామాజిక వర్గం గణనీయంగా ఉన్నందున ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అయినా పుంగనూరుపై.. పెద్దిరెడ్డి పట్టు సాధించారు. హోరాహోరీ జరిగినా.. ఆయనే గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మదనపల్లె నియోజకవర్గంలో…వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డికి చాన్సివ్వలేదు. కొత్త అభ్యర్థి నవాజ్‌బాషాను నిలబెట్టింది. టీడీపీ తరపున మాజీ ఎమ్మెల్యే దొమ్మాలపాటి రమేష్ పోటీ చేస్తున్నారు. తిప్పారెడ్డి అనుచరులు కొందరు అంతర్గతంగా టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు. పెద్దిరెడ్డి వర్గంపై తిప్పారెడ్డి మండి పడుతున్నారు. అయితే పెద్దిరెడ్డి… సాయంతో చివరికి వైసీపీ అభ్యర్థి నవాజ్ బయట పడటం ఖాయంగా కనిపిస్తోంది. . శ్రీకాళహస్తిలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి టీడీపీ అభ్యర్థిగా తొలిసారి బరిలోకి దిగారు. వైసీపీ తరపున బియ్యపు మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకూ టీడీపీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎన్సీవీ నాయుడు వైసీపీలో చేరారు. బీజేపీ అభ్యర్థిగా కోలా ఆనంద్.. కాంగ్రెస్ తరఫున బత్తెయ్యనాయుడు, జనసేన అభ్యర్థిగా వినుత బరిలో ఉన్నారు. వీరు ముగ్గురు ఎంతమేర ఓట్లు చీలుస్తారనే దానిపైనే రెండు ప్రధాన పార్టీల గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. బొజ్జల తనయుడి కోసం… పూర్తి స్తాయిలో వ్యూహాలు పన్నుతున్నారు. సంప్రదాయకంగా.. టీడీపీ బలంగా ఉంది. కానీ.. నేతలను ఆకర్షించి .. వైసీపీ అభ్యర్థి గెలుపు దిశగా ముందుకు సాగుతున్నారు.
తిరుపతిలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుగుణమ్మ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి. జనసేన తరపున చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేస్తున్నారు. ఇతర ఎమ్మెల్యేలకు భిన్నంగా.. ఎమ్మెల్యేగా సుగుణమ్మ పనితీరు ఉంటుంది. ఎవరైనా నేరుగా వెళ్లి కలిసే అవకాశం ఉండటం.. తిరుపతి ప్రజల్ని ఆకట్టుకుంది. ఇక్కడ 2015 ఉపఎన్నికల్లో 1.15 లక్షల ఓట్ల మెజార్టీతో నెగ్గిన సుగుణమ్మ మళ్లీ గెలుస్తాననే ధీమాతో ఉన్నారు. రెడ్డి సామాజికవర్గం తక్కువగా ఉండటం.. ఇతర వర్గాల ఓట్లు చీలిపోవడం ఖాయం కావడంతో.. భూమనకు మరోసారి నిరాశ ఎదురు కానుంది. నగరి నియోజకవర్గంలో… పరిస్థితి హోరాహోరీగా ుంది. మాజీ మంత్రి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భానుప్రకాశ్ తొలిసారి బరిలో ఉన్నారు. ఆయనపై సానుభూతి ఉంది. మాజీ ఎమ్మెల్యే చెంగారెడ్డి వర్గం మద్దతు తెలిపింది. టిక్కెట్ ఆశించి భంగపడిన వారు.. దారిలోకి వచ్చారు. చేయిస్తున్నారు. రోజా.. పెద్దగా అందుబాటులో ఉండకపోవడం మైనస్‌గా మారింది. నగరిలో తమిళ ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంది. అదీ కూడా.. రోజా భర్త సెల్వమణి వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో.. ఆ దిశగా రోజా పోల్ మేనేజ్ మెంట్ చేసుకుంటున్నారు. ఈ సారి కూడా రోజా అసెంబ్లీకి రావొచ్చని సర్వేలో తేలింది.
నల్లారి కుటుంబానికి పెట్టని కోటగా ఉన్న పీలేరులో గత ఎన్నికల్లో సొంత పార్టీ పెట్టుకుని వారు ఓడిపోయారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు. ఈయనకు టీడీపీ టిక్కెట్ కేటాయించింది. వైసీపీ తరపున చింతల రామచంద్రారెడ్డినే పోటీ చేస్తున్నారు. కానీ ఇక్కడ నల్లారి కుటుంబానికి సానుభూతి కనిపిస్తోంది. టీడీపీలో చేరిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలకు సంక్షేమపథకాలు అందేలా కిషోర్ జాగ్రత్లు తీసుకున్నారు. ఇక్కడ ఈ సారి నల్లారి పుణ్యమా అని టీడీపీ జెండా ఎగరడం ఖాయమయింది. తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ పోటీ చేస్తున్నారు. వైసీపీ తరపున పెద్దరెడ్డి రామచంద్రారెడ్డిసోదరుడు ద్వారకానాథ్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇది టీడీపీకి పట్టు ఉన్న నియోజకవర్గం.. తంబళ్లపల్లెకు తమ ప్రభుత్వ హయాంలో హంద్రీ- నీవా జలాలు రావడం ఈసారి శంకర్‌యాదవ్‌కు అత్యంత పెద్ద ప్లస్‌పాయింట్. మాజీ ఎమ్మెల్యే ఏవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి వర్గం టీడీపీకి సహకరిస్తోంది. ఈయనను జగన్ మోసం చేశాడనే అసంతృప్తి ప్రజల్లో ఉంది. పెద్దిరెడ్డి సోదరుడికి ఆర్థిక బలానికి లోటు లేనప్పటికీ.. శంకర్ యాదవ్ కే… రెండో సారి అవకాశం దక్కనుంది.
సత్యవేడులో టీడీపీ తరపున జేడీ రాజశేఖర్, వైసీపీ తరపున ఆదిమూలం పని చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తలారి ఆదిత్యపై నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటంతో చంద్రబాబు టిక్కెట్ నిరాకరించారు. అయితే.. వారి తీరుతో.. కొన్ని వర్గాలు టీడీపీకి దూరం అవడం.. వైసీపీ అభ్యర్థి ఆదిమూలంకు గత ఎన్నికల్లో ఓడిపోయారనే సానుభూతి కలసి వస్తుందని అంచనా. ఇప్పటికైతే.. వైసీపీ అభ్యర్థికే పరిస్థితి అనుకూలంగా ఉంది. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామికి అవకాశం ఇచ్చారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం మహా భారతంలో దళితులపై వివక్షకు సంబంధించిన వివాదంలో నారాయణస్వామి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది. . ఈయనకు గతంలో రెండు వర్గాలు మద్దతు పలికేవి. కానీ.. అక్కడ సంప్రదాయంగా జరిగే “పచ్చికాపల్లం మహాభారతం”లో దళితులు బండికుంభాలు తోలకూడదని, అగ్నిగుండ ప్రవేశం చేయరాదని రెండేళ్ల క్రితం అగ్రవర్ణాలు అడ్డుకున్నాయి. ఈ సందర్భంలో అగ్రవర్ణాలకు నారాయణస్వామి మద్దతుగా నిలబడ్డారు. దళితులు రాజకీయంగా వైసీపీకి దూరమైన పరిస్థితులు ఉన్నాయి. టీడీపీలో మాజీ మంత్రి డాక్టర్ కుతూహలమ్మ తనయుడు హరికృష్ణ పోటీ చేస్తున్నారు. ఈ సారి ఇక్కడ టీడీపీకి విజయావకాశాలు కనిపిస్తున్నాయి.
నియోజకవర్గం | పార్టీ |
---|---|
తంబళ్లపల్లె | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
పీలేరు | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
మదనపల్లె | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
పుంగనూరు | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
చంద్రగిరి | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
తిరుపతి | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
శ్రీకాళహస్తి | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
సత్యవేడు (ఎస్సీ) | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
నగరి | వైసీపీ ( వైసీపీ హోల్డ్ ) |
గంగధార నెల్లూరు (ఎస్సీ) | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
చిత్తూరు | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |
పూతలపట్టు (ఎస్సీ) | టీడీపీ ( గెయిన్ ఫ్రం వైసీపీ ) |
పలమనేరు | వైసీపీ ( గెయిన్ ఫ్రం టీడీపీ ) |
కుప్పం | టీడీపీ ( టీడీపీ హోల్డ్ ) |