ఈమధ్య తాప్సి పేరు మీడియాలో బాగా వినిపించింది. మరీ ముఖ్యంగా రాఘవేంద్రరావు – కొబ్బరికాయ ఎపిసోడ్లో తాప్సి హాట్ టాపిక్ అయిపోయింది. దాంతో ఎక్కడకు వెళ్లినా… తాప్సికి ఈ కొబ్బరికాయ ప్రశ్నే ఎదురవుతోందట. ఆనందో బ్రహ్మ ప్రమోషన్లతో కాస్త బిజీగా ఉంది తాప్సి. ఇక్కడ కూడా రాఘవేంద్రరావుకి సంబంధించిన ప్రశ్న తరచూ ఎదురవుతోందట తాప్సికి. ”మీడియాలో చాలామంది నన్ను ఈ ప్రశ్న వేశారు. అందులో దాదాపు ప్రతి ఒక్కరూ.. ఈ ఎపిసోడ్లో మీ తప్పేం లేదు.. మీరు కావాలని చేయలేదు.. అన్నవాళ్లే. అయితే.. ఒక్కరూ నాకు సపోర్ట్ చేస్తూ ఆర్టికల్స్ రాయలేదు. ఎవరి టీఆర్పీ రేటింగ్స్ వాళ్లు చూసుకొన్నారు” అంటూ వాపోయింది తాప్సి. ”మీడియా వాళ్లు ఇలానే ఆలోచిస్తారేమో. నా సినీ జీవితంలో ఇవన్నీ మామూలే అని నాకు నేను సర్దిచెప్పుకొన్నా. ఎవరి కోణంలో వాళ్లు ఆలోచిస్తున్నారేమో అనిపిస్తోంది..” అంటోంది తాప్సి. తన ఫేస్ బుక్, ట్విట్టర్లో కూడా చాలామంది తనని తిట్టిపోశారట. వాళ్లందరినీ బ్లాక్ చేసి అలసిపోయానని అంటోంది తాప్సి. ”నా గురించి ఎన్ని రోజులు మాట్లాడుకొంటారు? మరో హాట్ టాపిక్ రాగానే మర్చిపోతారు. ఆ సంగతి తెలుసు. అందుకే నేను కూడా లైట్ తీసుకొన్నాను. కేవలం కొంతమందిని సంతృప్తి పరచడానికే… ‘ఐ యామ్ సారీ’ అంటూ అపాలజీ చెప్పాల్సివచ్చింది” అంటోంది తాప్సి.