నిర్మాణ రంగంపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. కానీ.. రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడరు. డబ్బులు తీసుకోవడం అలవాటైపోయిన హీరోలు, హీరోయిన్లూ…డబ్బులు ఇచ్చే పాత్రంటే కాస్త జంకుతారు. ముఖ్యంగా కథానాయికలు. అందుకే నిర్మాతలుగా మారిన హీరోయిన్లు చాలా తక్కువ. అయితే ఈమధ్య ట్రెండ్ మారింది. కథానాయికలు కూడా పెట్టుబడి పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడ తాప్సి కూడా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపింది. తన స్నేహితుడు ప్రంజల్తో కలసి `అవుట్ సైడర్స్` అనే సంస్థ ను స్థాపించింది. త్వరలోనే ఓ సినిమాని తమ సంస్థ ద్వారా నిర్మించబోతున్నట్టు ప్రకటించింది. అయితే.. అందులో ఎవరు నటిస్తారు? ఆ సినిమా ఏ భాషలో రాబోతోందన్న విషయాలు మాత్రం ప్రకటించలేదు. `పింక్`, `బద్లా` లాంటి సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది తాప్సి. తాను ఇప్పుడు ఓ పాన్ ఇండియా స్టార్. సౌత్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న కథానాయికల్లో తాప్సి పేరు కూడా వినిపిస్తుంది. తను నటించిన `హసినా దిల్ రూబా` ఇటీవల ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం `మిషన్ ఇంపాజిబుల్`లో నటిస్తోంది.