వెంట్రుక వేసి కొండను లాగేస్తే గొప్పా?
కొండను తవ్వి ఎలక పట్టడం గొప్పా?
ఇందులో డౌటే లేదు. మొదటి దానికే ఎవ్వరి ఓటైనా! కానీ చిత్రసీమలో మాత్రం ఈ సూత్రం రివర్స్ లో పరుగులు పెడుతుంటుంది. కొండను తవ్వి ఎలుకల్ని పడుతున్న సినిమాలే అన్నీ. మా సినిమా రూ.50 కోట్లు తెచ్చుకొంది అని గొప్పగా చెబుతారు. అదీ నిజమే. కానీ ఆ సినిమా బడ్జెట్టే రూ.45 కోట్లు దాటేస్తుంది. వడ్డీలు, థియేటర్ రెంట్లూ అన్నీ పోయి చేతికి రూ.30 వస్తే.. నిర్మాత ఏం తింటాడు? అప్పులే తీర్చుకొంటాడా, ఇంకో సినిమానే తీస్తాడా? భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఇలానే లెక్కలు తప్పుతున్నాయి. ఈ యేడాది భారీ విజయాలు అనుకొన్న ఏ సినిమా అయినా తీసుకోండి. నిర్మాతలకు మిగిలిందేం లేదు. ‘సూపర్ హిట్ సినిమా తీశారు’ అన్న పేరు తప్ప. పది రూపాయలపెట్టి సినిమా తీస్తే.. పన్నెండు రూపాయలు రావడం కూడా లాభమే. కానీ… ఎంతొచ్చినట్టు?? ఎంత రిస్క్ చేస్తే ఎంత మిగిలినట్టు? అదే రూపాయితో సినిమా తీసి రెండు రూపాయలు సంపాదిస్తే..? అది అసలైన మజా. ఆ మాయాజాలం చిన్న సినిమాలతోనే సాధ్యం. అప్పుడప్పుడూ ఇలాంటి మెరుపు తీగలు తగులుతూ ఉంటాయి. 2016లోనూ అలాంటి సినిమాలొచ్చాయి. ఒకటి.. పెళ్లిచూపులు.. రెండోది బిచ్చగాడు.
ఈ రెండు సినిమాల్లోనూ స్టార్లు లేరు. ఈ సినిమాల వెనుక స్టార్ మేకర్లూ లేరు. కానీ ఇవి రెండు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాలకు తీసుకొచ్చిన ధైర్యం మాటల్లో చెప్పలేం! పెళ్లి చూపులు బడ్జెట్ కోటి రూపాయల లోపే. కానీ తీసుకొచ్చింది ఎంతో తెలుసా? రూ.13 కోట్లు. అంటే రూపాయి పెడితే పన్నెండు రూపాయలు లాభం. ఇదే నిష్పత్తిలో లాభాలు లెక్కెడితే.. పెళ్లి చూపులు ముందు బాహుబలి కూడా బలాదూరే! సరైనోడు, జనతా గ్యారేజ్ కూడా ఈ యేడాది సూపర్ హిట్ల జాబితాలో చోటు సంపాదించుకొన్నాయి. కానీ ఆయా సినిమాల వల్ల నిర్మాతలకు, బయ్యర్లకు ఎంత మిగిలింది? అంటే స్పష్టంగా చెప్పలేం. పెట్టిన పెట్టుబడి వస్తేనే గొప్పగా మారిందిప్పుడు. అలాంటిది ఈ స్థాయిలో లాభాలు తీసుకురావడం సామాన్యమైన విషయం కాదు. ఇదే స్ఫూర్తితో కనీసం వంద సినిమాలైనా పట్టాలెక్కుతాయి. అదీ.. చిన్న సినిమా స్టామినా.
ఇక బిచ్చగాడు అయితే.. అందర్నీ షాక్‌లో పడేసింది. ఈ సినిమా రైట్స్‌కి రూ.40 లక్షలకు కొన్నాడు నిర్మాత. పబ్లిసిటీ కోసం మరో అరవై లక్షలు ఖర్చు పెట్టాడు. అదీ తొలి వారం వరకే. ఆ తరవాత.. పబ్లిసిటీ అవసరమే లేకుండా పోయింది. మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. టోటల్‌గా ఈ సినిమా రూ.12 కోట్ల వరకూ వసూలు చేసింది. అంటే.. రూపాయికి 12 రూపాయల లాభం. ఇంతకంటే.. నిర్మాతకు ఏం కావాలి? బిచ్చగాడు ఇచ్చిన ధైర్యంతో ఆ తరవాత చాలా డబ్బింగ్ సినిమాలు బాక్సాఫీసుపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కానీ.. ఏ ఒక్క సినిమా నిలబడలేదు. లాభాల పరంగా చూస్తే.. పెళ్లి చూపులు, బిచ్చగాడు ఈ యేడాది సూపర్ డూపర్ హిట్లుగా నిలిచినట్టు. ఆ మాటకొస్తే వీటిని కొట్టే సినిమానే ఈ యేడాది కనిపించలేదు.