అమరావతి రియల్ ఎస్టేట్‌కు మళ్లీ మంచి రోజులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ గెలిచిన తర్వాత మళ్లీ రాజధాని పనులు పరుగులు పెట్టించాలని నిర్ణయించారు. ఐదేళ్ల పాటు పెరగకుండా.. ఇంకా తగ్గిపోయిన ధరలు టీడీపీ గెలిచిన తర్వాత సాధారణ స్థితికి వచ్చారు. గతంలోలా ఈ సారి ఒకే సారి హైప్ రాకుండా.. మెల్లగా పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అమరావతి పనులు ప్రారంభం కానున్న తరుణంలో ప్లాట్లు కొనేందుకు ఎంక్వయిరీలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా తాడికొండ, అమరావతి, 14వ మైల్ గ్రామాల్లో అమరావతి ప్రకటించినప్పుడు వందల కొద్దీ వెంచర్లు వేశారు. సీఆర్డీఏ అనుమతితో ఉన్న వెంచర్లు చాలా ఉన్నాయి. అయితే వాటి అమ్మకాలు అంత జోరుగా సాగలేదు.
ఐదు సంవత్సరాల పాటు తమ పెట్టుబడులు ఇరుక్కుపోవడంతో రియల్టర్లు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో హైప్‌ను చూసి స్థలాలు కొన్న వారు కూడా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు అప్పట్లో వేసిన వెంచర్లలో కొనేవారు పెరిగిపోయారు. ఎంక్వయిరీలు, సైట్ విజిట్లు కూడా పెరిగాయి. గతంలో తమ్ముడు కాని ప్లాట్లు ఇప్పుడు కాస్త పెరిగిన ధరకు అమ్ముతూండటంతో.. వడ్డీ కూడా గిట్టుబాటు అవుతుందని రియల్టర్లు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా పెరుగుతాయని కొంత మంది ఎక్కువ రేటు చెబుతున్నారు. ఇంత కాలం ఆగాం కాబట్టి.. అమరావతి నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులు ప్రారంభయ్యే వరకూ చూడాలనుకుంటున్నారు.
అన్ని అనుమతులు ఉన్న వెంచర్లో రెండు వందల గజాల స్థలం పాతిక లక్షలకు లభిస్తోంది. ప్రధాన రహదారికి కాస్త దగ్గరగా ఉన్నది అయితే కాస్త ఎక్కువ ధర చెబుతున్నారు. అయితే అత్యధిక లే ఔట్లలో ఇంకా పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయలేదు. దీర్ఘకాలికంగా మంచి పెట్టుబడి అవుతుంది కానీ.. ఇప్పటికిప్పుడు ఇళ్లు కట్టుకునే అవకాశం ఉండదు. కాలనీల నిర్మాణం ప్రారంభం కావాలంటే.. అమరావతి నిర్మాణం పూర్తి స్థాయిలో జోరందుకోవాలని అంచనా వేస్తున్నారు. గతంలోలా ఈ సారి అవదని.. అమరావతి జనంతో నిండిపోతుందని.. మెట్రో సిటీ అవుతుందన్న నమ్మక పెరిగితే ఇంకా ెక్కువ డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.