తాడిపత్రిలో మళ్లీ ఫ్యాక్షన్ తరహా దాడులు ప్రారంభమయ్యాయి. తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నేరుగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి లేరు. అయినప్పటికీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో.. వారి కుర్చీని తెప్పించి వేసుకుని ఇంట్లో వారిని పిలిపించి పంచాయతీ పెట్టారు. తనపై ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు ఎవరు పెట్టారో చెప్పాలని ప్రశ్నించారు. జేసీ ఇంట్లో ఉన్న కిరణ్ అనే యువకుడ్ని పెద్దారెడ్డి వర్గీయులు చితక బాదారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. పెద్దారెడ్డి తన ఇంటికి వచ్చి.. తన ఇంట్లో మనుషుల్ని కొట్టినట్లుగా తెలియడంతో అనంతపురంలో ఉన్న ప్రభాకర్ రెడ్డి , జేసీ అస్మిత్ రెడ్డి హుటాహుటిన తాడిపత్రి చేరుకున్నారు.
పెద్దారెడ్డి హంగామా తెలిసిన వెంటనే… జేసీ అనుచరులు పెద్ద ఎత్తున జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. పెద్దారెడ్డి కూర్చున్న కుర్చీని రోడ్డు మీదకు తీసుకు వచ్చి తగులబెట్టారు. ఈ సందర్భంగా కొంత మంది పెద్దారెడ్డి వర్గీయులు అక్కడే ఉండటంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు చాలా కాలంగా చోటు చేసుకుంటున్నాయి. అనేక మంది ప్రభాకర్ రెడ్డి వర్గీయులపై కేసులు పెట్టారు. అలాంటిది హఠాత్తుగా.. ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి పెద్దారెడ్డి హల్ చల్ చేయడం కలకలం రేపుతోంది. కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని కొట్టడానికి వెళ్లారని కాదని.. ప్యాక్షన్ సమరంలో.. పైచేయి సాధించానని చెప్పుకోవడం కోసమే పెద్దారెడ్డి… నేరుగా ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లారని చెబుతున్నారు.
నీ ఇంటికొచ్చా.. నీ నట్టింటికొచ్చా అనే డైలాగ్ తరహాలో.. ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి వార్నింగ్ పంపారని అంటున్నారు. కేతిరెడ్డి, జేసీ వర్గాల మధ్య ఫ్యాక్షన్ గొడవలు ఇప్పటివి కావు. అనేక మంది బలయ్యారు. కొన్నాళ్లుగా ఫ్యాక్షన్ గొడవలు సద్దు మణిగాయి. తాడిపత్రిలో పెద్దారెడ్డి గెలిచిన తర్వాత పరిస్థితి మారిపోయింది. తన ఇంట్లోకి వచ్చి మరీ తన మనుషుల్ని పెద్దారెడ్డి కొట్టడంతో జేసీ ప్రభాకర్ రెడ్డి సైలెంట్ గా ఉండే అవకాశం లేదని ఆయన గురించి తెలిసిన వాళ్లు అంటున్నారు. మొత్తానికి తాడిపత్రిలో మాత్రం సాధారణ పరిస్థితులు ఇప్పుడల్లా నెలకొనే అవకాశాలు లేవు.