ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తనను చంపించాలనుకుంటున్నారని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. తనకు గన్ లైసెన్స్ రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. తాను ప్రజల మనిషినని..ప్రజల్లోనే ఉంటానని..చంపుతావా? అని ప్రశ్నించారు. పోలీసులు చట్టాలను పాటించడం లేదని.. పై నుంచి వస్తున్న ఆదేశాల మేరకే పని చేస్తున్నారని.. అందుకే తాను కేసు పెట్టదల్చుకోలేదని స్ఫష్టం చేశారు. సజ్జల చెప్పినట్టు పోలీసులు వింటున్నారని స్పష్టం చేశారు. సీసీ ఫుటేజీ తీసుకొని కేసు పెట్టమంటే… పోలీసులు ఒత్తిళ్లు ఉన్నాయని అంటున్నారని.. తాను కేసు పెడితే పోలీసులు సస్పెండ్ అవుతారని జేసీ చెప్పుకొచ్చారు.
ఏపీలో లా అండ్ ఆర్డర్ లేదు.. పోలీసులు మారాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. పెద్దారెడ్డి తన ఇంటికి పైకి చర్చలకు వచ్చానని చెబుతున్నాడని.. మాట్లాడటానికి కత్తులు, కటార్లతో వస్తారా.. అని ప్రశ్నించారు. చంబల్ లోయల్లో ఉండాల్సినవాళ్లు తాడిపత్రిలో ఉన్నారని విమర్శించారు. పార్నపల్లి, పెండెకల్లు, అచ్యుతాపురంలో దాడులు చేసి దోచుకున్నారని.., పెద్దారెడ్డిపై మండిపడ్డారు. తాడిపత్రి వివాదంలో.. తాను కేసు పెట్టబోనని జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నారు.
అయితే.. పెద్దారెడ్డి వర్గీయులు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఇప్పటికే అట్రాసిటీ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా.. తాను వెనక్కి తగ్గే ప్రశ్నే లేదన్నారు. మరో వైపు.. పెద్దారెడ్డితో పాటు ఆయన కుమారులపైనా కేసులు పెట్టినట్లుగా పోలీసులు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఎవరు ఫిర్యాదు చేశారో స్పష్టత లేదు. తాడిపత్రి రగడ అంశం.. ఏపీలో శాంతిభద్రతల పరిస్థితిని.. పోలీసుల వ్యవహారశైలిని మరోసారి చర్చనీయాంశం చేసింది. జేసీ ప్రభాకర్ రెడ్డి సజ్జలపై ఆరోపణలు చేయడం.. ఆసక్తి రేపుతోంది. ఆయన సలహాదారుగా ఉంటూ.. హోంమంత్రిత్వశాఖను తన గుప్పిట్లో పెట్టుకున్నారని.. డీజీపీ కన్నా ఎక్కువగా ఆయనే విధులు నిర్వహిస్తున్నారని… ఇప్పటికే టీడీపీ నేతలు అనేక సార్లు ఆరోపించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అవే ఆరోపణలు చేశారు.