అనంతపురం జిల్లాలో తాడిపత్రి నియోజకవర్గం అంటే… అందరికీ జేసీ బ్రదర్సే గుర్తుకు వస్తారు. అది ఫ్యాక్షన్ అడ్డాగా.. అందరి మనసుల్లో నిలిచిపోయింది. ఈ సారి అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు… అస్మిత్ రెడ్డిని రంగంలోకి దించుతున్నారు. వైసీపీ తరపున… కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలోకి దిగుతున్నారు. రెండు వర్గాల మధ్య ఒకప్పుడు హోరాహోరీగా ఫ్యాక్షన్ నడిచింది. ఇటీవలి కాలంలో చల్లబడింది. కేతిరెడ్డి పెద్దారెడ్డిది తాడిపత్రి కాదు… ధర్మవరం నియోజకవర్గం. అయినప్పటికీ.. జేసీ ప్రభాకర్ రెడ్డికి ఆయనే సరిజోడి అంటూ.. జగన్… తాడపత్రికి పెద్దారెడ్డిని తెచ్చారు. అప్పట్నుంచి తరచూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతూనే ఉన్నాయి.
తాడిపత్రిపై… జేసీ సోదరులు పూర్తి స్థాయి పట్టు సాధించారు. వారికి అక్కడ ఎదురు లేదని చెప్పవచ్చు. కానీ… అదంతా భయం వల్లనే వచ్చిందని… వారి భయం లేదని భావిస్తే.. అందరూ.. ప్రత్యామ్నాయం చూసుకుంటారని.. వైసీపీ వర్గాలు అంచనా వేశాయి. అందుకే.. ఆయనకు ధీటుగా ఉన్నారన్న కారణంగా పెద్దరెడ్డిని వైసీపీ రంగంలోకి దింపుతోంది. ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే కుమారుడి గెలుపు కోసం… గ్రామాల వారీగా వ్యూహాలు రెడీ చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి మాత్రం… తెర వెనుక వ్యవహారాలతో సిద్ధం అయ్యారు. అధికారికంగా అభ్యర్థిని ప్రకటించిన తర్వాత తాడిపత్రిలో హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.
తాడిపత్రి.. అంటే ఫ్యాక్షన్ అని చాలా మందికి అనిపించవచ్చు కానీ.. దేశంలోనే అభివృద్ధి పరంగా గుర్తింపు పొందిన మున్సిపాలిటీ. మున్సిపాలిటీల్లో వచ్చే ఆదాయం… ఖర్చులను బేరీజు చేసుకుంటే మిగులు నిధులు ఉండడం అరుదు. అలాంటిది తాడిపత్రి మున్సిపాలిటీలో 2014 నాటికి రూ.29 కోట్లు మిగులు నిధులున్నాయి. ఐదేళ్ల కాలంలో ఆ మున్సిపాలిటీ తీరు పరిశీలిస్తే ఆ బడ్జెట్ రూ.156 కోట్లకు చేరింది. అంటే మున్సిపల్ బడ్జెట్టే రూ.125 కోట్ల కు పైగా పెరిగింది. తాడిపత్రి మున్సిపాలిటీ స్వచ్ఛభారత్‌లో జాతీయ అవార్డుతో పాటు పలు రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా అందుకుంది. తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో కల్యాణమండపాలు నిర్మించి ఆర్థికస్వావలంబన కలిగేలా చేశారు. పెద్దవడుగూరు మండలకేంద్రంలో రూ. 1.40 కోట్లు ఖర్చుచేసి ఫంక్షన్ హాలు నిర్మించారు.
వ్యక్తిగతంగా… సాయం చేయడంలో… జేసీ సోదరులు ఎంత ఉదారంగా ఉంటారో…. తమను ఎదిరిస్తే అంత కఠినంగా ఉంటారు. అందుకే వారిని అభిమానించేవారు ఎంత మంది ఉంటారో.. వ్యతిరేకించేవారు కూడా అంతే మంది ఉంటారు..! అందుకే తాడిపత్రి… ఎన్నికల ఆసక్తికరంగా మారింది.