” ఈ ఎన్నికలు మాకు లైఫ్ అండ్ డెత్ ” అని జేసీ ప్రభాకర్ రెడ్డి నెల రోజుల కిందట మీడియాతో వ్యాఖ్యానించారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు అయిన తాడిపత్రిని కంచుకోటగా మార్చుకుంది జేసీ కుటుంబం. కానీ అనూహ్యంగా గత ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. జేసీ బ్రదర్స్ ఇద్దరూ ఓటమి చెందలేదు. వారి వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంతో ఇద్దరూ ఓడిపోయారు. ఓడిపోయినా తాడపత్రిని ఒక్క రోజు కూడా విడిచి పెట్టలేదు జేసీ ప్రభాకర్ రెడ్డి, వ్యాపారాల్ని నిర్వీర్యం చేశారు. అనుచరుల్ని వేధించారు. కేసులు పెట్టారు. జైల్లో వేశారు. అయినా తగ్గలేదు. చివరికి జేసీ ప్రభాకర్ రెడ్డి నట్టింట్లోకి వచ్చి కుర్చీలో కూర్చుని పెద్దారెడ్డి సవాల్ విసిరారు. ఇన్ని అవమానాలు, వేధింపులతో సాగిన ఐదేళ్ల కాలాన్ని పుండు మీద కారం రాసుకుంటూ గుర్తు చేసుకుంటూ…రాజకీయం చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు ఆయన కుమారుడు తాడిపత్రి బరిలోఉన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడిపత్రి వైసీపీ అభ్యర్థిగా కేతిరెడ్డి పెద్దారెడ్డి పోటీ చేశారు. మొత్తం 49 శాతం ఓట్లు రాబట్టి విజయం సాధించారు. అదే సమయంలో టీడీపీ నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కొడుకు జేసీ అస్మిత్ రెడ్డి టీడీపీ టిక్కెట్ పై పోటీ చేశారు. 45 శాతం ఓట్లు రాబట్టుకున్నారు. ఇతరులకు 6 శాతం ఓట్లు వచ్చాయి. ఏడు వేల ఓట్ల తేడాతో జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు పరాజయం పాలయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో తాడిపత్రి మున్సిపాలిటీతో పాటు పెద్దపప్పూరు, పెదవడుగూరు, యాడికి మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీలో ఎప్పుడూ జేసీ కుటుంబం ఆధిక్యత చూపిస్తుంది. మిగతా మూడు మండలాలు హోరాహోరీగా ఉంటాయి.
తాడిపత్రికి బయట ఎలాంటి ఇమేజ్ ఉన్నా… దేశంలోని బెస్ట్ మున్సిపాలిటీల్లో ఒకటి. అయితే ఇది ఐదేళ్ల కిందటి వరకే. దేశాలు దాటి వ్యాపారాలు చేస్తున్నా.. ఊరుపై జేసీ ప్రభాకర్ రెడ్డి మమకారాన్ని మాత్రం ఎవరూ కాదనలేరు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు.. తాడిపత్రిని అభివృద్ది పరంగా.. నిర్వహణ పరంగా నీట్ గా ఉంచేందుకు ఆయన కఠిన నిర్ణయాలు తీసుకుంటారు. అద్భుతమైన పౌరసదుపాయాలు తాడిపత్రిలో ఉంటాయి. కానీ గత ఐదేళ్లుగా తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి విశ్వరూపం చూపించడంతో అస్తవ్యస్తమయిపోయింది. టీడీపీ మున్సిపల్ చైర్మన్ గా సీటు గెల్చుకున్నా స్వయంగా ప్రభాకర్ రెడ్డి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినా… అధికారుల నుంచి కనీస సహకారం అందలేదు. తమ ఊరు పాడైపోతోందన్న ఆందోళన తాడిపత్రి వాసుల్లో ఉంది.
తాడిపత్రి ఫ్యాక్షన్ నియోజకవర్గమే కానీ.. ఫ్యాక్షన్ హత్యలు జరిగి ఏళ్లు గడిచిపోయింది. కానీ వర్గాలున్నాయి. అదే ఎమ్మెల్యే పెద్దారెడ్డికి బలంగా మారింది. తాడిపత్రిలో ఆధిక్యత చూపించడం సాధ్యం కాదని తేలడంతో మిగిలిన మండలాలపై పెద్దారెడ్డి దృష్టి పెట్టారు. కానీ మొదట్లో బయంతో సైలెంట్ అయిపోయిన నేతలు.. మెల్లగా బయటకు వచ్చి టీడీపీకి మద్దతు పలుకుతున్నారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన వీఆర్ రామిరెడ్డి సహా ఆయన వర్గం అంతా టీడీపీలో చేరింది. పరిస్థితి రాను రాను క్లిష్టంగా మారుతూండటంతో .. పెద్దారెడ్డి బెదిరింపులు స్టార్ట్ చేశారు. ఎవరు అధికారంలోకి వచ్చినా తాను ఫ్యాక్షన్ స్టార్ట్ చేస్తానని బెదిరిస్తున్నారు. పార్టీలు మారకుండా.. టీడీపీకి మద్దతు ప్రకటించకుండా ఉండేలా చూసుకోవాలన్నది ఆయన ప్లాన్. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తాను ఫ్యాక్షన్ తీసుకు రానని చెబుతున్నారు. అభివృద్ధి చేసుకుందామని కౌంటర్ ఇస్తున్నారు.
జగన్ గాలిలో గెలిచిన పెద్దారెడ్డి నిరక్ష్యరాస్యుడు. అదే అదనుగా ఆయనతో వైసీపీ నేతలు, అధికారులు ఓ ఆట ఆడుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఇప్పుడు తన ఫ్యాక్షన్ బలాన్నే చూపి మళ్లీ గెలవాలని అనుకుంటున్నారు. ప్రభుత్వం మారితే .. తాడిపత్రిలో ఓడిపోతే .. ఇప్పుడు శాంతి వచనాలు చెబుతున్న జేసీ వర్గీయులు… ఎలా వ్యవహరిస్తారో చెప్పడం కష్టం. అందుకే బయటకు చెప్పకపోయినా కేతిరెడ్డికి కూడా ఈ ఎన్నిక లైఫ్ అండ్ డెత్ లాంటిదే. పోరాటం ఎవరూ ఊహించనంత స్థాయిలో జరగడం ఖాయంగా కనిపిస్తోంది.