పోలీసులతో కుమ్మక్కయి ప్రాజెక్టుల సదస్సుల పేరుతో అనంతపురం టీడీపీ నేతలు హడావుడి చేస్తున్నారని తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ నేతలపై విరుచుకుపడ్డారు. రెండేళ్లుగా ఒక్క కార్యకర్తని కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ప్రాజెక్టుల సదస్సులకు రమ్మంటే కార్యకర్తలు ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. లోకేష్‌ను నర్సరావుపేటకు పోనీయకుండా అడ్డుకున్న పోలీసులు అనంతపురంలో మాత్రం ప్రాజెక్టుల సదస్సుకు ఎందుకు అనుమతిఇచ్చారని ప్రశ్నించారు. ఇద్దరు నేతల కనుసన్నల్లో ఆ సదస్సు జరుగుతోందని..పోలీసులతో కుమ్మక్కయి నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
రాయలసీమ ప్రాజెక్టుల అంశంపై టీడీపీ నేతలు రెండు రోజుల పాటు సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. రాయలసీమకు చెందిన టీడీపీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు అందరూ హాజరవుతారని ప్రకటించారు. ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఎక్కడివక్కడే ఆగిపోయాయని ప్రజల ముందు పెట్టాలని అనుకున్నారు. కార్యకర్తలకు అండగా ఉండేందుకు సదస్సులు పెట్టాలి కానీ.. నీటి ప్రాజెక్టుల పేరుపై కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టులపైన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అన్ని పార్టీలు పోరాడాయి ఏమన్నా ఫలితం ఉందా అని ప్రశ్నించారు.
అనంతపురం జిల్లాలో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది కాబట్టే తాము నాయకులమయ్యామని .. కానీ ఆ కార్యకర్తలకు ఒక్కరంటే ఒక్క నాయకుడు కూడా అండగా లేరని ఆరోపించారు.
అనంతపురం జిల్లా అంటే టీడీపీకి కంచుకోట.. కానీ ఇతర నాయకులు దీనిని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీలో ఇతర నేతలతో సరి పడదు. ఆయనకు చాలా తక్కువ మందితోనే సంబంధాలు ఉంటాయి. రెండు రోజుల కిందట ఈ సదస్సు విషయంపై మైసూరారెడ్డి కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చి కలిశారు. ఇప్పుడు సదస్సుపై విమర్శలు గుప్పించారు.