వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది పచ్చి నిజం. ప్రపంచ వింతల్లో ఒకటిగా పేరుబడ్డ అందాల పాలరాతి కట్టడానికి కీటకాలవల్ల, శవాల వల్ల బెడదొచ్చిపడింది.
ముందుగా కీటకాలు తాజ్ కు ఏ విధంగా నష్టం కలిగిస్తున్నాయో తెలుసుకున్న తర్వాత శవాల దగ్గరకు వెళదాం.
తాజ్ మహల్ ని రాత్రిపూట లైట్ల కాంతిలో చూస్తూ మైమరిచిపోతున్నారు సందర్శకులు. వారి ఉత్సాహాన్ని గమనించిన టూరిజం శాఖ పున్నమి రోజులకు అటూఇటూ మూడు రోజులు రాత్రిపూట సందర్శకులకు అనుమతి ఇస్తోంది. ఇదో స్పెషల్ షోలాగా జరుగుతోంది. సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండాఉండేందుకు, అలాగే తాజ్ లైట్ల కాంతిలో ధగధగా మెరిసిపోయేందుకు లైట్లు ఏర్పాటుచేశారు. సందర్శకులకు పరమానందంగానే ఉన్నప్పటికీ, తాజ్ మహల్ గోడలమీద జిడ్డుగా ఉండే మరకలు పడుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల తెల్లటిపాలరాతి గోడలు మసకబారిపోతున్నాయి. ఏమిటా, కారణమని ఆరాతీస్తే, లైటు పురుగులు ఆకర్షించబడి అవి గోడలమీద వాలడం, మలవిసర్జన చేయడంతో జిగురులాగా మరకలు పడుతున్నాయని తేలింది. యమునా నదివైపునున్న గోడలపై ఇది మరీ ఎక్కువగా కనబడుతోంది. గడ్డిలోని రసాన్ని పీల్చుకునే కీటకాలివి. ఇవి లైటు కాంతికి ఆకర్షితమవుతుంటాయి. యుమునానది ఒడ్డువైపు నుంచి వచ్చేసి తాజ్ లైట్ల చుట్లూ గుమిగూడుతున్నాయి. అవి అక్కడే మలం విసర్జించడం లేదా చనిపోవడం వంటివి జరుగుతుండటంతో అవి తర్వాత ఎండిపోయి తెల్లటి గోడలపై అసహ్యకరమైన మరకలుగా మారుతున్నాయి. అవి ఓ పట్టాన పోవడంలేదు. పైగా పాలరాతి నాణ్యత తగ్గిపోతుంది.
రాత్రిపూట సహజసిద్ధమైన చంద్రకాంతిలో తాజ్ ఎలాంటి లైట్లు లేకుండానే మెరిసిపోతుంటుంది. అలాంటప్పుడు ఎలాంటి కృత్రిమ కాంతి అక్కర్లేదు. సందర్శకులను ఆకర్షించడం మాట ఎలా ఉన్నా, కీటకాలు మాత్రం గుంపులుగుంపులుగా వచ్చేసి పాలరాతి గోడలను పాడుచేస్తున్నాయి. లైట్ల కాంతిని గణనీయంగా తగ్గించి కీటకాల వల్ల తాజ్ కు ఎదురవుతున్న ఇబ్బందిని తొలగించాలి.
శశ్మాన కాలుష్యం
తాజ్ మహల్ కి కొద్దిదూరంలోనే శ్మశానవాటిక ఉంది. అక్కడ రోజూ సగటున 20 నుంచి 25 శవాలకు దహన సంస్కారాలు జరుగుతుంటాయి. దీనివల్ల ప్రేమచిహ్నమైన తాజ్ కు కాలుష్యం బెడద కలుగుతోంది.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ గత సెప్టెంబర్ లో కుటుంబసభ్యులతో కలిసి తాజ్ మహల్ ని సందర్శించారు. అప్పుడు ఆయన ఓ విషయం గమనించారు. తాజ్ కి ఒకవైపు నుంచి దట్టమైన పొగ, బొగ్గురేణువులు రావడంపై ఆరా తీశారు. తాజ్ కు పక్కనే శ్మశానవాటికి ఉన్నదని తెలిసింది. ఈ కారణంగా తాజ్ కు శ్మశాన కాలుష్యం తప్పడంలేదని గ్రహించారు. అక్టోబర్ 1న ఆయన సుప్రీంకోర్టు ఛీప్ జస్టిస్ కి లేఖరాస్తూ, శ్మశానవాటిక నుంచి వచ్చే పొగ, బొగ్గు రేణువుల వల్ల తాజ్ కట్టడం కాలుష్యానికి గురవుతున్నదని తెలియజేశారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. తాజ్ మహల్ కి దగ్గరగా ఉన్న శ్మశానవాటికను తరలించే యోచన చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. అక్కడి నుంచి శ్మశానవాటికను తరలించాలని ఆగ్రానగర్ నిగమ్-ఆగ్రా డెవలప్ మెంట్ అథారిటీకి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా ప్రయోజన శూన్యమే. ఈ శ్మశానవాటికలో ఆధునిక సౌకర్యాలు లేవు. ఇప్పటికీ కట్టెలుపేర్చి శవాన్ని దానిపై ఉంచి తగలబెడుతున్నారు. కనీసం ఎలక్ట్రానిక్ క్రెమటోరియమ్ ఏర్పాటుచేయాలన్న ఆలోచనకూడా రాకపోవడంపై సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఎన్నో ఆధునిక సౌకర్యాలున్నా వాటిని మీరు ఉపయోగించుకోవడంలేదు, అదే ఎలాంటి సౌకర్యాలు సరిగా లేనిరోజుల్లో కేవలం చేతులు, ఉలి, సుత్తితో అంతపెద్ద కట్టడాన్ని అద్భుతంగా కట్టారు. కనీసం దాన్ని జాగ్రత్తగా ఉంచే ప్రయత్నమైనా సరిగా చేయండి, నాటి స్ఫూర్తి మీలో లోపించిందంటూ ఇద్దరు సభ్యులతో కూడిన సుప్రీం ధర్మాసనం చురకలేసింది. మరి ఈ చురకలకు అధికారుల్లో చలనం వస్తుందా, లేక దున్నపోతుమీద వానపడినట్లేనా…?
మొత్తానికి తాజ్ మహల్ కి ఎదురవుతున్న ఈ రెండు బెడదలను యుపీ ప్రభుత్వం, అధికారులు తొలగిస్తారని ఆశిద్దాం.