హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన రాజీనామా వ్యవహారంపై ఇవాళ స్పందించారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న టీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులపై ఎదురుదాడికి దిగారు. తనను విమర్శించేముందు ఈ నాయకులు తమ తమ గురించి ఆలోచించుకోవాలన్నారు. అందరి గుట్టూ తనవద్ద ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వైఎస్ సీఎమ్‌గా ఉన్నపుడు 9మంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. గత ఏడాది ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుకలను టీడీపీలోకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించింది ఎవరని ప్రశ్నించారు. కొత్తపల్లి గీత టీడీపీలో చేరలేదా అని అడిగారు. ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, తిప్పేస్వామి, జూపూడిలను టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారని అడిగారు. పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యీల జాబితాను చదివారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టుబడిన దొంగకూడా తనగురించి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసేముందు ఏపీలో టీడీపీలో చేరినవారిగురించి ప్రస్తావించాలని అన్నారు. ఎన్నికలు, పదవులు తనకు కొత్త కాదని చెప్పారు. తనపై పోటీకి ఎవరు వచ్చినా ఎదుర్కోటానికి తాను రెడీ అని సవాల్ విసిరారు. తాను డిసెంబర్ 16నే రాజీనామాను స్పీకర్‌కు సమర్పించానని చెప్పారు. రాజీనామా అంశం స్పీకర్ పరిధిలో ఉందని, ఆయన తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తానని అన్నారు.పొద్దున్న లేస్తే అందరూ శ్రీనివాస యాదవ్ అంటున్నారని, కావాలంటే తనచుట్టూ తిరుగుతూ పూజలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. నాలుగు రోజులు రాజకీయాలు పక్కన పెడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని హెచ్చరించారు.
మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ తలసాని రాజీనామా వ్యవహారంపై గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తలసానిని బర్తరఫ్ చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. అయితే గవర్నర్ సరిగా స్పందించలేదని చెబుతూ బయటకొచ్చి రాజ్‌భవన్ ఎదురుగా ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.