ప్రతిపక్ష నాయకులకు ఎంత ఘాటుగా కౌంటర్ ఇస్తే అంత గొప్ప అనుకుంటున్నట్టు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీకి చెందిన కొందరు మంత్రులు. మొన్ననే, అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, నాతో ప్రజల్లోకి రా… ఉరికించి ఉరికించి కొడతారంటూ మంత్రి ఎర్రబెల్లి విమర్శించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత, ముఖ్యమంత్రి క్లాస్ కూడా తీసుకున్నట్టు కథనాలు వచ్చాయి. ఇది జరిగి రెండ్రోజులైనా కాలేదు, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇలానే ప్రతిపక్ష నాయకులపై తీవ్ర విమర్శలే చేశారు.
పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వడం లేదంటూ కాంగ్రెస్, భాజపా నేతలు లేనిపోని హడావుడి చేస్తున్నారు అన్నారు మంత్రి తలసాని. ఏదో ఒకటి మాట్లాడాలన్న ప్రయత్నమే తప్ప, వారు చేసే విమర్శల్లో వాస్తవం లేదన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఎవరు మొదలుపెట్టినా వెంటనే అయిపోయేది కాదనీ, కొంత సమయం పడుతుందన్నారు. ఇళ్ల నిర్మాణం అనుకున్న వెంటనే రెండ్రోజుల్లో అయిపోవు కదా అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్నెల్లపాటు ఎంతో కృషి చేసి అద్భుతమైన బడ్జెట్ తయారు చేశారన్నారు. ప్రతిపక్ష నేతలు కుక్కల్లా అరుస్తున్నారనీ, వాళ్లలా తాము వ్యవహరించలేమని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష పార్టీల నాయకులకు కనీస మర్యాద ఇవ్వాల్సి ఉంటుంది కదా! మరీ ఈ స్థాయిలో వారిని పోల్చి విమర్శించడం హర్షించదగ్గది కాదు. రాజగోపాల్ రెడ్డి మీద ఎర్రబెల్లి అతిగా మాట్లాడి అభాసుపాలు కావడంతో ఆయనకి ప్రాధాన్యత పెంచినట్టయిందని తెరాస నేతలు మొన్నట్నుంచీ మథనపడిపోతన్నారంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తలసాని వ్యాఖ్య కూడా అలాంటిదే. ప్రతిపక్ష పార్టీ నేతలకు అంశాలవారీగా, ప్రభుత్వం చేస్తున్న పనుల్ని చూపించి ఎదుర్కొవాలి. అంతేగానీ, ఇలా వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేస్తే అంతిమంగా సొంత పార్టీ ప్రతిష్ఠతకే దెబ్బ!