రేవంత్ రెడ్డి సీఎం అయిన రెండు రోజుల్లోనే ఆరు గ్యారంటీల్లో రెండు పథకాలు అమలు చేశారు. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మరొకటి ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. పది లక్షలకు పెంచడం. ఈ పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. జిల్లాల్లో .. నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నేతలు తమకు తాము హడావుడి చేసి… మైలేజీ తెచ్చుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఈ స్కీమ్ ఓపెనింగ్స్ లో ఏ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా పాల్గొనలేదు ఒక్క తలసాని తప్ప.
పథకాలు ప్రారంభమైన ఒక రోజు తర్వాత అమీర్‌పేటలోని ప్రభుత్వ హాస్పిటల్లో 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ సేవలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలకు అండగా ఉంటామని చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన మహాలక్ష్మి కార్యక్రమం కింద మహిళలకు రూ.2500 ఆర్థిక సాయం, రూ.4 వేల పింఛను, రూ.500కే గ్యాస్ సిలిండర్ కూడా వెంటనే అమలు చేయాలని తలసాని ప్రభుత్వాన్ని కోరారు.
తలసాని తీరుతో బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోయారు. ఓ వైపు తలసాని నిర్వహించిన శాఖలకు సంబంధించిన ఫైళ్లను దొంగతనం చేయబోయారని.. ఆయన ఓఎస్డీపై కేసు నమోదయింది. ఈ తరుణం లో ప్రభుత్వాన్ని పొగుడుతూ కార్యక్రమాలను ఓపెన్ చేయడం ఆసక్తకరంగా మారింది. ప్రభుత్వం తనను టార్గెట్ చేయకుండా ఉండటానికి ఇలాంటి సిగ్నల్స్ పంపుతున్నారని భావిస్తున్నారు.