సికింద్రాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేరును ఖరారు చేస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం ప్రకటించింది. బీజేపీ తరపున కిషన్ రెడ్డికి టిక్కెట్ ప్రకటించారు. ఇక మిగిలింది బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడమే. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి .. సికింద్రాబాద్ పరిధిలోని ఆరు సెగ్మెంట్లలో మంచి మెజారిటీ వచ్చింది.
కొన్నిరోజుల వరకు తలసాని ఫ్యామిలీకే అని ప్రచారం చేశారు. మొదట తలసాని కుమారుడికి చాన్సిస్తారని అనుకున్నారు. తర్వాత గట్టి పోటీ ఇవ్వాలనుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవే కరెక్ట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన కూడా వెనుకడుగు వేశారు. ఇప్పుడు పద్మారావు గౌడ్ లేదా వారి ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఖచ్చితమని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మేరకు చర్చలు కూడా జరిగాయి. ఒకవేళ పద్మారావు గౌడ్ ఎన్నికల్లో పోటీకి సుముఖత చూపని పక్షంలో అంబర్పేట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి, మాజీ హౌంమంత్రి నాయిని నరసింహారెడ్డి అల్లుడు రాంనగర్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి పేర్లను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలిస్తున్నారు. అయితే వీరెవరూ నిలబడలేరని పద్మారావు అయితే కాస్త పోటీ ఇస్తారని భావిస్తున్నరారు.
సికింద్రాబాద్ నుంచి బీజేపీ తరపున కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మరోసారి పోటీ చేస్తున్నారు. ఈయన ఇప్పటికే ప్రచారంలో ముందుకు సాగుతున్నారు. ఇక్కడ బీజేపీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ భారీ కసరత్తులో ఉన్నాయి. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్‌రెడ్డిని ఓడించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ కృతనిశ్చయంతో ఉంది. అందుకే అభ్యర్థి ఎంపికలో ఆలస్యమైనప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటున్నదని అంటున్నారు. ఇప్పటి వరకూ బీఆర్ఎస్ ఈ నియోజకవర్గంలో గెలవలేదు. ఈసారి పరిస్థితులు వ్యతిరేకంగా మారాయి.