తెలంగాణాలో తెదేపా నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ని టార్గెట్ గా చేసుకొని చాలా విమర్శలు, న్యాయపోరాటాలు చేసారు. ఎందుకంటే ఆయన తెదేపా ద్వారా గెలుచుకొన్న తన ఎమ్మెల్యే పదవికి నేటికీ రాజీనామా చేయకుండా తెరాస ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు కనుక. వారి ప్రయత్నాలు ఫలించకపోయినప్పటికీ, వారి విమర్శలకి ఆయన వద్ద జవాబు లేదు కనుక మౌనంగా వాటిని భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆంధ్రాలో వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలో చేర్చుకోవడంతో తలసానికి కూడా చంద్రబాబు నాయుడుని విమర్శించేందుకు చాలా మంచి అవకాశం దక్కింది.
ఆయన ఈరోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు మేము తెదేపాని వీడి తెరాసలో చేరినప్పుడు మేము సంతలో పశువుల్లా అమ్ముడుపోయామని చంద్రబాబు మమ్మల్ని అవహేళన చేసారు. మరి ఇప్పుడు ఆయనేమి చేసిన పనేమిటి? ఆయన కూడా వైకాపా ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లాగ ఎంత డబ్బు చెల్లించి కొనుకొన్నారో చెపితే బాగుంటుంది. నోరుంది కదాని ఇతరుల గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడకూడదు. ఆయన చేస్తే నీతి మేము చేస్తే అవినీతవుతుందా?”
“మమ్మల్ని రాజీనామాలు చేయమని కోరుతున్న చంద్రబాబు ఇప్పుడు వైకాపా ఎమ్మెల్యేల చేత కూడా రాజీనామాలు చేయించగలరా? అలాగయితే మేము కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము. చంద్రబాబు నాయుడు పదేళ్ళు సమైక్య రాష్ట్రాన్ని పాలించిన పెద్ద మనిషి. అందరికీ నీతులు భోధించే సత్య హరిశ్చంద్రుడు. పైగా జాతీయ స్థాయి నాయకుడు. ఆయన తను చాలా ఆదర్శావంతుడిలాగా మాట్లాడుతుంటారు. కనుక ఇప్పుడు ఆయన చేసింది తప్పో ఒప్పో ఆయనే చెప్పాలి. అప్పుడు మావంటివారు ఆయనను ఆదర్శంగా తీసుకోవచ్చో లేదో తెలుసుకొంటాము.”
“ఒకప్పుడు భూమానాగి రెడ్డి ని ఫ్యాక్షనిష్టు అన్న వ్యక్తి మరిప్పుడు ఆయనని పార్టీలో ఏవిధంగా చేర్చుకొన్నారో చెప్పాలి. ఆయన సింగపూర్, మలేషియా అంటూ ప్రజలకు కలలు చూపిస్తూ మభ్యపెడుతున్నారు. ఆయనను నమ్ముకొని విజయవాడ పరిసర ప్రాంతాలలో స్థలాలపై పెట్టుబడులు పెట్టిన వారు తీవ్రంగా నష్టపోయారు. వారందరికీ ఆయనేమని సమాధానం చెపుతారు?” అని తలసాని శ్రీనివాస్ యాదవ్ చంద్రబాబు నాయుడుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు.