దాదాపు ఏడాదిరోజులు గడచిపోయాయి. ఆయనేమో తాను ‘తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేసాను’ అంటారు. కానీ.. స్పీకరు మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించరు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే హోదాలోనే ఉంటూ.. ఇటు తెరాస మంత్రిగా ఆయన పరిపాలన లో భాగస్వామిగా మారిపోయి చెలరేగుతున్నారు. మరోవైపు తెదేపా వాళ్లంతా.. ఆయన మీద అనర్హత వేటు వేయాల్సిందేనంటూ కోర్టు ద్వారా గవర్నరు ద్వారా రాష్ట్రపతి ద్వారా తమకు చేతనైన అన్ని మార్గాల్లోనూ విఫలయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఉప ఎన్నిక గురించి ఎన్నడూ పెదవి విప్పని.. తలసాని శ్రీనివాసయాదవ్ ఇన్నాళ్లకు ఇప్పుడు మాట్లాడుతున్నారు. తాను ఉప ఎన్నికకు భయపడనని, ఎప్పుడైనా ఎన్నికకు సిద్ధంగా ఉంటానని అంటున్నారు.
మొత్తానికి గ్రేటర్ ఎన్నికల ఫలితాలను గమనించిన తర్వాత.. ఇప్పుడు తలసానికి ధైర్యం వచ్చినట్లుంది. దాదాపు ఏడాదిరోజులుగా తన అర్హతలు అభ్యర్థిత్వం, మంత్రి పదవి గురించి అటు తెలుగుదేశం, ఇటు కాంగ్రెస్ పార్టీలు నానా యాగీ చేస్తున్నప్పటికీ.. నేను రాజీనామా చేసేసాను. ఇక ఆమోదాలు, ఇతర పర్యవసానాలతో నాకు నిమిత్తం లేదు అంటూ మౌనం పాటిస్తూ వచ్చిన తలసాని శ్రీనివాసయాదవ్.. గ్రేటర్ లో తన నియోజకవర్గం ప్రజలు కూడా పెద్దఎత్తున తెరాసకు పట్టం కట్టడంతో గుండెధైర్యాన్ని చిక్కబట్టుకున్నట్లుగా కనిపిస్తోంది.
సనత్ నగర్ నియోజకవర్గం తెలుగుదేశానికి చాలా స్ట్రాంగు నియోజకవర్గం అనే ధీమాతోనే ఆయనను దమ్ముంటే రాజీనామా చేయాలంటూ తెదేపా వారు గతంలో పదేపదే అంటూ వచ్చారు. అదే మాదిరిగా గతంలో అక్కడినుంచి ప్రాతినిధ్యం వహించిన మర్రి శశిధర్రెడ్డి కూడా.. కాంగ్రెస్కు బలమైన సీటు అనే ఉద్దేశంతో ఇదే సవాలు చేస్తూ వచ్చారు. తలసాని జనాన్ని మోసం చేశారని.. జనం మాత్రం ఈ రెండు పార్టీలవైపునే ఉన్నారని వారు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ.. ఫలితాలు వెల్లడయ్యేసరికి అంతా తేడా అయిపోయింది. అందరూ ఉమ్మడిగా కేసీఆర్ వెంట ఉన్నారనే నమ్మకం చిక్కిన తర్వాత.. ఇక ఉప ఎన్నిక వచ్చినా పర్లేదనే భావనకు తలసాని తెగించినట్లుగా పలువురు భావిస్తున్నారు.