ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడటమే పనిగా పెట్టుకున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్! ఆంధ్రాలో తెరాస పాత్రేంటో, ఏం ఆశించి ఇక్కడి రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారో అనేది మాత్రం చెప్పరు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్ లో కూర్చుని, ఆంధ్రా రాజకీయాలపై మరోసారి మాట్లాడారు తలసాని. చంద్రబాబు ఇప్పుడు ఇస్తున్న పసుపు కుంకుమ, రైతులకు ఇచ్చే అన్నదాత సుఖీభవ.. ఇవన్నీ దొంగ అని తేలిపోయిందని ఆరోపించారు. ఎన్నికలైన తరువాత, సీఎం సున్నం పెడతారంటూ తెలంగాణలో కూర్చుని ఏపీ ప్రజలకు చెప్పారు! ‘ఆంధ్రాలో అనినీతి లేదంటే తలపగలగొట్టుకోవాలా, నేను ఆంధ్రాలోనే తిరుగుతున్నా. ఇండియాలో ఎక్కడాలేని కరప్షన్ ఇక్కడుందని ప్రజలు చెప్తున్నారు. కేసీఆర్ పాలన అద్భుతం అని ప్రజలు మెచ్చుకుంటున్నారు’ అన్నారు తలసాని. ఎన్నికలు పూర్తయ్యాక ఆయన కూడా హైదరాబాద్ కే వచ్చేస్తారనీ, అక్కడ ఉండలేరని చంద్రబాబుని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
తమ రాష్ట్రానికి ఎందుకొస్తావని చంద్రబాబు అడుగుతున్నారనీ, ‘అదేమన్నా మీ తాతదా, మేం వస్తాం’అంటూ తీవ్రంగా స్పందించారు తలసాని. ఓటుకు నోటు కేసులో చిక్కుకుని ఆయన హైదరాబాద్ నుంచి పారిపోయారని విమర్శించారు. ఫామ్ 7 అప్లికేషన్లు తప్పుకాదనీ, అలా దరఖాస్తులు ఇచ్చినవారిపై కూడా కేసులు పెడతారంటూ పరోక్షంగా వైకాపా చర్యల్ని సమర్థించారు. ఆంధ్రా ఎన్నికలతో తమకు ఏదైనా సంబంధం ఉందని ఎప్పుడైనా చెప్పామా, చెప్పలేదు కదా అన్నారు తలసాని. తమని చూసి చంద్రబాబు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రాలో తాను పెట్టబోయే మీటింగ్ కి పోలీసులు పర్మిషన్లు ఇవ్వలేదనీ, ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగులు పెట్టుకోవచ్చన్నారు.
ఆంధ్రాకి మేం వస్తామంటూ పెద్ద మాటలు చెబుతున్నారు తలసాని! తెలంగాణ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం అక్కడ పోటీ చేస్తే ఏమన్నారో గుర్తులేదా? ‘తెలంగాణకు చంద్రబాబు అవసరమా, టీడీపీ అవసరమా’ అంటూ ప్రచారం చెయ్యలేదా! ఇప్పుడు, ఆంధ్రాలో తెరాస పోటీ చెయ్యదు, ఇక్కడి రాజకీయాలతో ఎలాంటి సంబంధమూ లేదు, కానీ, ఏపీ ప్రభుత్వ పథకాల తీరుపై తెలంగాణ భవన్ లో కూర్చుని ఆంధ్రులకు తలసాని సందేశాలు ఇచ్చేస్తుంటారు!!! పసుపు కుంకుమ రెండో విడత చెక్కుల పంపిణీ ఏపీలో ప్రస్తుతం జరుగుతోంది. ఈ చెక్కులు చెల్లవంటూ గతంలో విమర్శలు చేసినవాళ్లు ఇవాళ్ల ఏం అనడం లేదు. డబుల్ చేసిన పెన్షన్లు అందుతున్నాయి. ఇతర సంక్షేమ పథకాలన్నీ పెద్ద ఎత్తున అమలు జరుగుతున్నాయి. ఇవన్నీ క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవాలు. ఇవి తలసానికి ఏం తెలుస్తాయి? ఆంధ్రా ఎన్నికలతో సంబంధం ఉందని మేం చెప్పామా అంటారు! సంబంధం లేనప్పుడు ఎందుకీ కంఠశోషట! ఫామ్ 7 దరఖాస్తులు తామే చేశామని జగన్ ఒప్పుకుంటే, తప్పేం లేదు అని ఈయన సమర్థించాల్సిన పనేముంది..?