ఏ పార్టీ నుంచి గెలిచినా సరే గెలిచిన పార్టీ లో మంత్రి అవ్వాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లుగా ఉన్నారు. కాంగ్రెస్ లోకి వస్తానని మంత్రి పదవి ఇవ్వాలని తలసాని పంపిన రాయబారాన్ని రేవంత్ రెడ్డి తిరస్కరించారని అయితే తలసాని మాత్రం ప్రయత్నాలు మానలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు రేవంత్ రెడ్డిదేముంది.. మొత్తం రాహుల్ దేనని ఆ వైపు నుంచి ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఇండియా కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ తో తలసాని ఇటీవల సమావేశమయ్యారని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ను బలోపేతం చేస్తామని.. తనకు మంత్రి పదవి ఇప్పించేందుకు సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంలో రాహుల్ పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అఖిలేష్ యాదవ్ భరోసా ఇవ్వడంతో తలసాని గుంభనంగా ఉంటున్నారని చెబుతున్నారు.
కాంగ్రెస్ హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఆయన పార్టీలో చేరిపోయే అవకాశం ఉంది. అయితే మంత్రి పదవి ఇస్తేనే ఆయన పార్టీ మారాలనుకుంటున్నారు. ఆ మంత్రి పదవుల కోసం … కాంగ్రెస్ లో ఓ యుద్ధమే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సాధ్యమా అన్నదే సందేహంగా మారిందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.