బాపు కేసీఆర్ కు.. గట్టి షాక్ ఇచ్చేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ రెడీ అయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం ఖరారు కోసం నిర్వహించిన సమావేశానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరు కాలేదు. కొద్ది రోజులుగా తలసాని వ్యవహారం తేడాగా ఉంది.
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్ని.. తెలంగాణ బాపు కేసీఆర్ అంటూ ఓ రేంజ్ లో నిర్వహించిన ఆయన.. ఆ తర్వాత ఒక్క సారిగా చల్లబడిపోయారు. సికింద్రాబాద్ నుంచి తన కుమారుడికి సీటు కోసం ఆయన ఆ హంగామా చేశారు. పరిస్థితి తెలిసి వచ్చే సరికి ఆయన కుమారుడికి సీటు అవసరం లేదని ప్లేటు ఫిరాయించారు. అయితే తలసానినే పోటీ చేయమని కేసీఆర్ అడిగితే.. నిర్మోహమాటంగా నో చెప్పేశారు. దాంతో .. చివరికి సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావును ఖరారు చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు నియోజకవర్గంలో తలసాని తిరగడం లేదు. పట్టించుకోవడం లేదు. రెండు రోజుల కిందట ఆయన అయోధ్య నుంచి రాముడ్ని దర్శించుకున్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాలో పెట్టారు. కొద్ది రోజులుగా ఆయన బీ జేపీ హైకమాండ్ తో టచ్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు పరోక్షంగా ఆయన బీజేపీకే సహకరిస్తున్నట్లుగా చెబుతున్నారు. తలసానితో పాటు ఆయన కుమారుడు సాయికిరణ్ కూడా హాజరు కాలేదు. తమకు సమావేశం గురించి తెలియదని.. ఆహ్వానం రాలేదని ఆయన చెబుతున్నారు. తలసాని కొడుకు సమాధానం బట్టి.. బీఆర్ఎస్ కు ఇక తలసాని దూరమైనట్లేనన్న అభిప్రాయం వినిపిస్తోంది.