తాటి చెట్టు ఎందుకు ఎక్కావురా అని వెనకటికి ఎవర్నో ప్రశ్నిస్తే… దూడకి గడ్డి కోసుకొద్దామని సమాధానమిచ్చాట్ట! అయ్యవారు అన్నేసి మొక్కులు ఎందుకు మొక్కారయ్యా అంటే.. ప్రజలను ఆదుకునేందుకు అని చెప్తున్నారు తెరాస నేతలు! ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కులూ పూజలూ ఆలయాలకు ఆభరణాల సమర్పణలపై అన్ని వర్గాల్లోనూ చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. సొంత మొక్కులు తీర్చడం కోసం ప్రజాధనాన్ని వెచ్చించడం ఎంతవరకూ కరెక్ట్ అంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నారు. ఇదే అంశమై హైకోర్టులో కేసు పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. కేసీఆర్ పూజలూ మొక్కులపై ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దేవాలయాలకు నగలు కానుకలుగా ఇస్తే తప్పేముందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ఇది ప్రజల బాగు కోసం చేస్తున్న పనే కదా అంటూ సమర్థించుకున్నారు. ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నారు కాబట్టే మొక్కులు తీర్చుకుంటున్నారు అంటూ కవరింగ్ ఇచ్చుకున్నారు. ఇందులో ప్రజాధనం దుర్వినియోగం అనే కాన్సెప్ట్ లేదన్నట్టుగానే సమర్థించుకున్న తీరు విడ్డూరంగా అనిపించడం లేదూ..!
కేసీఆర్ పూజలు చేయడం, దేవాలయాలకు కానుకలు ఇవ్వడం అనేది ఆయన వ్యక్తిగత విషయం. దాన్ని ఎవ్వరూ విమర్శించరు. కానీ, వ్యక్తిగత కార్యక్రమాల కోసం ప్రజాధనం ఖర్చు చేయడం ఎంతవరకూ సబబు అనేదే ఇక్కడ అసలు ప్రశ్న. ఈ పాయింట్‌ని చాలా తెలివిగా దాటేస్తున్నారు మంత్రి తలసాని! సరే, మంత్రిగారు చెబుతున్నట్టూ ఇదీ ప్రజల బాగు కోసం చేస్తున్నదే అయినప్పుడు… దీన్ని ఓ ప్రభుత్వ కార్యక్రమంగా మార్చెయ్యండీ. సంక్షేమ పథకాల జాబితాలో దీన్నీ చేర్చేయండి. ముఖ్యమంత్రి మొక్కుల కోసం ప్రతీయేటా ఫలానా ఇంత ఖర్చు చేద్దామనుకుంటున్నట్టు బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కూడా ప్రకటించెయ్యండీ..! అధికారం వారి చేతుల్లోనే ఉంది కదా!
మనది లౌకికరాజ్యం అని చిన్నప్పుడు చదువుకున్నాం. పాలనలో మత ప్రమేయం ఉండకూడదు. కానీ, కేసీఆర్ చేస్తున్నదేంటీ..? మొక్కుల పేరుతో దేవాలయాలకు కోట్లకు కోట్లు కానుకలిస్తూ ఆయన ప్రజలకు పంపుతున్న సంకేతాలేంటీ..? ఈ విషయాల గురించి మంత్రి మాట్లాడితే బాగుండేది. తమ నాయకుడిని వెనకేసుకుని రావడం తప్పులేదు. ఈ క్రమంలో మనం ప్రజలకు ఎలాంటి సిగ్నల్స్ ఇస్తున్నామనేది కూడా విశ్లేషించుకోవాలి కదా!