ఆ మధ్యన కొన్నిరోజుల పాటు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ గురించి మీడియాలో చాలా చర్చ జరిగింది. దానిలో ప్రధానంగా తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని మంత్రివర్గంలోకి తీసుకోవడం గురించే ఎక్కువగా చర్చ జరిగింది. మళ్ళీ ఇవ్వాళ్ళ మంత్రివర్గ విస్తరణ గురించి మీడియాలో వార్తలు కనబడటంతో మళ్ళీ దానిపై చర్చ మొదలయినట్లే భావించవచ్చు.
దసరాకి మంత్రివర్గ విస్తరణ చేసే అవకాశాలున్నాయని గతంలోనే అనుకొన్నారు. నారా లోకేష్ ని డిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నియమించే ఆలోచనలో ఉన్నట్లు తెదేపా వర్గాలు మీడియాకి లీకులు ఇచ్చాయి. కనుక ఆయనని మంత్రివర్గంలోకి తీసుకొంటారా లేదా అనే సందేహం మళ్ళీ తలెత్తడం సహజమే. దానిపై తెదేపా నేతలే స్పష్టత ఈయవలసి ఉంటుంది. కానీ లోకేష్ విషయంలో ఇటువంటి చర్చలు ఇంకా ఎంత జరిగితే అంత ఆయనకి, ప్రభుత్వానికీ కూడా చెడ్డపేరు వస్తుందని గ్రహిస్తే మంచిది.
తాజా సమాచారం ప్రకారం మరో ముగ్గురిని మంత్రివర్గంలోకి తీసుకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః ముందు చెప్పినట్లుగా దసరాకే మంత్రివర్గ విస్తరణ చేస్తారేమో? అ మాట వినగానే దానిని ఆశిస్తున్న వారికి చాలా ఆనందం, ఆందోళన కలగడం సహజమే. ఉన్నవి మూడే పదవులైనా వాటి కోసం పైరవీలు చేసే వారి ఒత్తిళ్ళు, కులాలు, మతాలు, ప్రాంతాల లెక్కలు వంటివన్నీ తెరపైకి వస్తాయి. వాటిని భరించి మంత్రివర్గ విస్తరణ చేసిన తరువాత మళ్ళీ ఆ పదవులు ఆశించి భంగపడినవారి అలకలు, కోపతాపాలు, అసంతృప్తిని భరించడం ప్రభుత్వానికి మరో పెద్ద కష్టమేనని చెప్పక తప్పదు. అందుకే ఆ తేనెతుట్టెని కదపడానికి ఏ ప్రభుత్వమైనా భయపడుతుంది. ఇప్పటికే అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటున్న తెదేపా ప్రభుత్వం అందుకు సాహసిస్తే అది చాలా విశేషమే అవుతుంది.