ముఖ్యమంత్రి పదవి అంటే అత్యున్నతం. రాష్ట్రానికి పాలకుడు. అన్ని రకాల అధికారాలు ఆయన చేతుల్లో ఉంటాయి. నిజానికి అది అనుభవించే అధికారం కాదు… చూపించాల్సిన బాధ్యత. రాష్ట్ర బాధ్యత ప్రజలు తన చేతుల్లో పెట్టినప్పుడు అంతకు మించి బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ సీఎం జగన్ ఏ విషయంలో బాధ్యతగా వ్యవహరిస్తున్నారో తెలియడం లేదు కానీ.. చివరికి సీఎం కుర్చీపై చిన్న పిల్లలకు కూడా గౌరవం లేకుండా చేయడానికి మాత్రం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. సీఎం అసభ్యంగా మాట్లాడితే తాము మాట్లాడితే తప్పా అని పిల్లలు అనుకునేలా చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగం అంతా ఒకేలా ఉంటోంది. స్పీచ్ మారట్లేదు. ఆ స్పీచ్‌లలో విపక్షాల నుంచి … నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ యాక్షన్ చేసి మరీ చూపిస్తున్నారు. ఆయన మాట తీరు.. హావభావాలు చూసి.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తేనా అనే డౌట్ చాలా మందికి వస్తోంది. ఆయన తీరు చూసి పిల్లలు కూడా ఇన్‌స్పయిర్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే విద్యాదీవెను, వసతి దీవెన, అమ్మఒడి వంటి పథకాలకు డబ్బులు రిలీజ్ చేస్తూ బటన్ నొక్కే సభల్లోనే జగన్ ఈ ప్రకటనలు చేస్తున్నారు. అందుకోసం పిల్లలను పెద్ద ఎత్తున సభలకు తీసుకు వచ్చి వారి ముందే ఈ డైలాగులు చెబుతున్నారు.
సీఎం జగన్ తీరుపై పెద్దల్లో అసహనం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వైసీపీ నేతలు బూతు పురాణాల్ని వినిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను మానసికంగా దెబ్బకొట్టేందుకు వారిపై .. వారి కుటుంబాలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. ఇదంతా వ్యూహాత్మకంగా చేస్తున్నారని .. వైసీపీ నేతలే ట్రైనింగ్ ఇస్తారని ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ లాంటి వాళ్లు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు సీఎం జగన్ పిల్లల ఎదుట కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడే మాటల్ని వైసీపీ కార్యకర్తలు సమర్థించవచ్చు.. వికృత మనస్థత్వం ఉన్న వారు చప్పట్లు కొట్టవచ్చు కానీ.. భావి పౌరుల మనసుల్ని కలుషితం చేస్తున్న తప్పిదం మాత్రం జరిగిపోతోంది. దీని వల్ల వైసీపీకి.. జగన్‌కు వచ్చే నష్టమే ఉండదు.. నష్టం అంతా సమాజానికే !