అనుకున్నట్టుగానే ఆ లాంఛనం కాస్తా పూర్తయింది. తెలంగాణ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు భాజపాలో చేరిపోయారు. ఆయన చేరికపై గత కొన్ని నెలలుగా రకరకాల ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. తనయుడు అరవింద్ తోపాటు డీఎస్ కూడా పార్టీ మారే ఆలోచనలో ఉన్నారనీ, తెరాసలో తనకు ఆశించిన గౌరవం దక్కడం లేదన్న అసంతృప్తితో ఆయన ఉన్నారంటూ ఊహగానాలు వినిపించాయి. పార్టీలో అనుకుంత స్వేచ్ఛ తనకు ఉండటం లేదనీ, ఏ అంశంపై మాట్లాడాలన్నా కూడా ముందుగా ముఖ్యమంత్రి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి డీఎస్ కు ఉందనే కథనాలూ వచ్చాయి. దీంతో డీఎస్ పార్టీ మార్పు ఖాయం అనడం.. దానిపై డీఎస్ స్పందించి, అలాంటి కథనాల్లో వాస్తవాలు లేవని కొట్టిపారేయడం జరిగింది. ఇదే తరుణంలో భాజపాకకు అనుకూలంగా డీఎస్ కుమారుడు అరవింద్ పత్రికా ప్రకటనలు ఇవ్వడంతో ఒక స్పష్టత వచ్చేసింది. పంద్రాగస్టునాడు మోడీ నాయకత్వం గురించి పొగడ్తలతో ముంచెత్తుతూ ఓ వాణిజ్య ప్రకటన ఇచ్చారు!
17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ తో భాజపా నిజామాబాద్ లో ఒక సభ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖమంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు. రాష్ట్ర భాజపా నేతలు లక్ష్మణ్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వస్తే గరీబోళ్లకు అధికారం వస్తుందని ఆశిస్తే, ఇప్పుడు గడీల పాలన సాగుతోందంటూ కేసీఆర్ సర్కారును ఉద్దేశించి నేతలు విమర్శలు గుప్పించారు. ఇదే కార్యక్రమంలో రాజ్ నాథ్ సమక్షంలో డీఎస్ కుమారుడు అరవింద్ కాషాయ తీర్థం పుచ్చుకున్నారు! పార్టీలో తన పాత్ర ఎలా ఉండబోతోందనేది త్వరలోనే అధినాయకత్వం చెబుతుందని అరవింద్ చెప్పారు. అంతేకాదు, భాజపాలో చేరాలనే నిర్ణయం తాను సొంతంగా తీసుకున్నదే అని ఆయన చెప్పడం విశేషం. తండ్రి డీఎస్ అధికార పార్టీ తెరాసలో ఉన్నప్పటికీ, తన ఆత్మ ప్రబోధం ప్రకారం భాజపాలో చేరాలనే నిర్ణయం తీసుకున్నానని, దీన్లో ఎక్కడా ఎలాంటి ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేయడం విశేషం.
నిజానికి, తన కుమారుడికి నిజామాబాద్ అర్బన్ టిక్కెట్ ఇవ్వాలంటూ కేసీఆర్ దగ్గర డీఎస్ ఒక ప్రతిపాదన పెట్టారనీ, దానికిపై కేసీఆర్ స్పందన సరిగా లేకపోవడంతో డీఎస్ అసంతృప్తికి గురైనట్టు కథనాలు వచ్చాయి. తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యంగా భావించి తెరాసలోకి వచ్చారనీ, అంతేగానీ కాంగ్రెస్ పార్టీలో లేని గౌరవం ఏదో తెరాసలో తనకు వచ్చేస్తుందనీ, పెద్దపెద్ద పదవులు చేపట్టేసి చక్రం తిప్పేద్దామన్న ఆశతో ఆయన చేరలేదని డీఎస్ అనుచరులు కూడా అన్నారు. ఆ వాదన ప్రకారం చూసుకుంటే.. ఇప్పుడు డీఎస్ కుమారుడు భాజపాలో చేరిపోయారు. అంటే, ఇంతగా ఆలోచించిన తండ్రితో సంబంధం లేకుండా తన భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చా?
నిజామాబాద్ ఎంపీ టిక్కెట్ విషయంలో భాజపా అభయం ఇచ్చింది కాబట్టే, ఆయన పార్టీలో చేరారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి డీఎస్ పార్టీ మార్పు అంశం తెరమీదికి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు! ఎందుకంటే, తన కుమారుడి రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని డీఎస్ అనుకున్నప్పుడు, ఇద్దరూ వేర్వేరు పార్టీల్లో కొనసాగే అవకాశం ఉంటుందా అనే చర్చ మొదలౌతుంది కదా! పైగా, తెలంగాణలో సీనియర్ నేతల్ని భాజపా ఆకర్షించే ప్రయత్నంలో ఉంది. ఇదే క్రమంలో డీఎస్ కు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్టు కూడా ఆ మధ్య చెప్పుకున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో మరోసారి డీఎస్ రాజకీయ భవిష్యత్తుపై మరోసారి చర్చ జరిగే అవకాశాలు కచ్చితం ఉన్నట్టే కనిపిస్తున్నాయి. మరి, ఈ చర్చ ఇంకాస్త ముందుకు వెళ్లనీయకుండా ఇప్పుడే డీఎస్ స్పందిస్తారో లేదో చూడాలి మరి!