సెట్‌కి వచ్చామా.. దర్శకుడు చెప్పిన సీన్, సాంగ్ చేశామా… ఆడియో ఫంక్షన్లో ఒకసారి కనిపించి, సినిమా విడుదలకు ముందు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చామా… అన్నట్టుంది చాలామంది హీరోయిన్ల పరిస్థితి. ఇక, నయనతార లాంటి హీరోయిన్లు ప్రమోషన్లకు రారనుకోండి! అది వేరే సంగతి. డబ్బింగ్ చెప్పడాలు గట్రా హీరోయిన్ల డిక్షనరీలో లేవు. డబ్బింగ్ చెప్పుకోవాలనుంది కానీ కుదరలేదని చాలామంది ఇంటర్వ్యూలలో చెప్తుంటారు. తమన్నా మాత్రం అలా కాదు. దర్శకుడు ఒప్పుకోవాలి గానీ డబ్బింగ్ సినిమాకు కూడా డబ్బింగ్ చెప్తుంది. శుక్రవారం తమిళ డబ్బింగ్ సినిమా ‘స్కెచ్’ విడుదలైంది. విక్రమ్ హీరోగా నటించిన ఈ సినిమా ఎవరైనా సగం చూస్తే చాలు రిజల్ట్ అర్థమవుతుంది. ప్లాప్ టాక్ వచ్చిన ఈ సినిమా వల్ల నటీనటులు ఎవరికీ పెద్దగా ప్రయోజనం లేదు. కానీ, తమన్నాను మాత్రం ఒక్క విషయంలో మెచ్చుకుని తీరాలి. శెహభాష్ అనాల్సిందే. ‘స్కెచ్’లో తన పాత్రకు తెలుగులో తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగులో ప్రమోషన్ కార్యక్రమాలకు కూడా అటెండ్ అయ్యింది. సినిమాను బాగా ప్రమోట్ చేసింది. తెలుగులో ‘ఊపిరి’ సినిమాకు సైతం తమన్నా డబ్బింగ్ చెప్పుకుంది. తర్వాత మళ్ళీ అరువు గొంతుపై ఆధారపడింది. బహుశా… పాత్ర స్వభావానికి ఆమె గొంతు సూట్ కాదని దర్శకులు భావించారేమో. సూటయ్యే క్యారెక్టర్లకు తమన్నా చేత డబ్బింగ్ చెప్పించుకుంటే బా.. గా.. నే ఉంటుంది. ముందు ముందు తమన్నా డబ్బింగ్ చెప్తుందో.. డబ్బింగ్ సినిమాతో సరిపెడుతుందో!