తమిళ మీడియాలో ఆరుపదుల చరిత్రఉన్న కుముదం వీక్లీ జర్నలిజం విలువలు పాటించడంలో దారితప్పింది. వివాదాస్పద కథనాలు ఇవ్వడమేకాదు, ఏకంగా ఫేక్ ఇంటర్వ్యూలను కూడా ప్రచురిస్తోంది. తాజాసంచికలో (07-12-15) తమన్నా ఇంటర్వ్యూ ప్రచురించారు. దక్షిణాది మిల్కీబ్యూటీ తమన్నాకు ఈ విషయం తెలిసి స్టన్ అయింది. కారణం, ఆమె ఈ ఇంటర్వ్యూ ఇవ్వకపోవడమే.
ఆ పత్రికకు తాను ఇంటర్వ్యూ ఇవ్వకపోయినా పత్రికలో ప్రచురితంకావడం ఆమెను చికాకుపరిచింది. ఇలాంటి ఫేక్ న్యూస్ విషయంలో తాను అలసిపోయినట్లు ఫీలైపోతున్నది. `కుముదం’ ప్రచురించిన ఇంటర్వ్యూలో కొన్ని అభిప్రాయాలతో తాను ఏకీభవించడంలేదనీ, అవన్నీ వారు (కుముదం వారు) కల్పించి రాసుకున్నారని తమన్నా అంటున్నది. తమన్నా తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయం చెప్పేసరికి ఇప్పుడది సోషల్ మీడియాల్లో హల్ చల్ చేస్తోంది. తన అభిమానులు కన్ఫ్యూజ్ కాకుండా ఉండటం కోసమే తానీ వివరణ ఇస్తున్నానని తమన్నా టిట్వర్ లో పేర్కొన్నది.
తమన్నా ఇంటర్వ్యూని ప్రచురిస్తూ `కుముదం’ పేజ్ మేకప్ విషయంలోకూడా సెన్సేషన్ సృష్టించాలనుకున్నట్లుంది. అందుకే చాలా లూజ్ గా ప్రవర్తించింది. సెక్సీగా ఉన్న తమన్నా చిత్రాన్ని ప్రచురిస్తూ, ఆమె నాభి దగ్గర మేగజైన్ పేజీ నెంబర్ ని, ప్రచురణ తేదీ ముద్రపడేలా చూసింది.
సినీనటులపై గాసిప్స్ రావడం మామూలే. అయితే ఇలా ఫేక్ ఇంటర్వ్యూలను కూడా ప్రచురించడంలో 67ఏళ్ల చరిత్ర ఉన్న కుముదం అనైతిక జర్నలిజంలో మరోమెట్టు ఎక్కేసింది.
మొన్న లెగ్గింగ్ ఫోటోలతోనూ వివాదం
1947 నుంచి వస్తున్న ఈ తమిళ పత్రిక గతకొంతకాలంగా గాడితప్పి పరిగెత్తుతోంది. జర్నలిజానికి ఉండాల్సిన నైతిక విలువలను పాతరేసిందన్న విమర్శలు తలెత్తుతున్నాయి. ఇదే ఏడాది (2015) సెప్టెంబర్ లో ఈ తమిళపత్రిక మహిళల లెగ్గింగ్స్ పై ఫోటోలను కవర్ పేజీలో ప్రచురిస్తూ, రాసిన కథనం తీవ్ర విమర్శలకు లోనైంది. ఈ కథనం, ఫోటోలు మహిళలను అవమానిస్తున్నట్లు ఉన్నాయని ఆరోపిస్తూ, యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని మహిళా సంఘాలు అప్పట్లో డిమాండ్ చేశాయి. సోషల్ మీడియాలో కుముందం వైఖరిని ఎండగడుతూ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. మహిళల లెగ్గింగ్స్ ను దొంగచాటుగా ఫోటోలు తీసి వాటిని ప్రచురించడం, ఇప్పుడు ఏకంగా తమన్నా ఫేక్ ఇంటర్వ్యూని ప్రచురించడంతో జర్నలిజంలో నైతిక విలువలు పాటిస్తున్నవారు అవాక్కయ్యారు. మరి దీనిపై కుముందం ఏ రకంగా స్పందిస్తుందో చూద్దాం.