మధుర్ బండార్కర్ ది ప్రత్యేకమైన శైలి. డార్క్ ఎమోషన్స్‌ని బాగా పట్టేస్తారాయన. ఆయన సినిమాలో నటించే ఛాన్స్ వచ్చిందంటే అవార్డు గ్యారెంటీ అని అంతా నమ్ముతారు. ఇప్పుడు తమన్నా కూడా అదే ఆశల్లో తేలుతోంది. మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తమన్నా కథానాయికగా ‘బబ్లీ బౌన్సర్’ అనే సినిమా రూపుదిద్దుకొంది. ఈనెల 23న హాట్ స్టార్‌లో ఈ సినిమా నేరుగా చూసేయొచ్చు. ఈ సినిమాతో తనకు అవార్డు రావడం ఖాయమని తమన్నా ధీమాగా చెబుతోంది. ”మధుర్ బండార్కర్ సినిమాలంటేనే అవార్డులకు కేరాఫ్ అడ్రస్స్. ఆయన సినిమాల్లో నటించినవాళ్లందరికీ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు నా వంతు. `బబ్లీ బౌన్సర్` సినిమాకీ నాకు అవార్డు వస్తుందని నమ్ముతున్నా. ఎందుకంటే అంత బలమైన పాత్ర అది” అని ధీమాగా చెబుతోంది తమన్నా. సెలబ్రెటీల పక్కన సెక్యురిటీగా బౌన్లరను చూస్తూనే ఉంటాం. లేడీ బౌన్సర్ల వ్యవస్థ కూడా ఉంది. మన దగ్గర తక్కువే గానీ, నార్త్ లో లేడీ బౌన్సర్లని చూడొచ్చు. అలాంటి ఓ బౌన్సర్ కథ ఇది. బాహుబలిలో తమన్నానటన తనకు బాగా నచ్చిందని, అందుకే ఏరి కోరి తమన్నాని ఎంచుకొన్నానని మధుర్ బండార్కర్ చెబుతున్నారు. ”ఈ సినిమాలో తమన్నాని ఎంచుకొన్నప్పుడు చాలామంది సందేహాలు వెలిబుచ్చారు. ఈ సినిమా విడుదలయ్యాక… వాళ్ల అనుమానాలన్నీ పటాపంచలు అవుతాయి. పాత్రధారుల్ని ఎంచుకొనేటప్పుడు నాకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి. అవెప్పుడూ తప్పవు” అని ధీమా వ్యక్తం చేశారు మధుర్ బండార్కర్.