ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆవశ్యకతని స్టార్లు గుర్తించారు. వెండి తెరకు నికార్సయిన ప్రత్యామ్నాయం అని నమ్ముతున్నారు. అందుకే వెబ్ సిరీస్, వెబ్ మూవీలలో స్టార్ల హంగామా ఎక్కువగానే కనిపిస్తోంది. తమన్నా కూడా ఇప్పటికి రెండు వెబ్ సిరీస్‌లు చేసేసింది లెవెంగ్త్ అవర్ (ఆహా), నవంబర్ స్టోరీస్ (హాట్ స్టార్) అనే రెండు వెబ్ సిరీస్‌లు తమన్నా నుంచి వచ్చాయి.
తమన్నాకున్న స్టార్ డమ్ దృష్ట్యా ఆయా నిర్మాతలు తమన్నాకు భారీగానే పారితోషికం ముట్టజెప్పారు. తమన్నా చేసింది కాబట్టి… వాటిపై ప్రేక్షకుల దృష్టీ పడింది. అయితే అనూహ్యంగా ఈ రెండు వెబ్ సిరీస్ లూ ఓటీటీ ప్రేక్షకుల్ని ఏమాత్రం మెప్పించలేకపోయాయి. సినిమాకి తగిన బడ్జెట్ పెట్టినా, అవుట్ పుట్ మాత్రం ఆ స్థాయిలో రాబట్టలేకపోయారు దర్శకుడు. థ్రిల్లింగ్ కంటెంట్ ఉంటేనే వెబ్ సిరీస్‌లు చేయాలి. ఈ రెండు కథల్లోనూ ఆ థ్రిల్ మిస్సయ్యింది. వెబ్ సిరీస్‌లుగా కాకుండా.. వెబ్ మూవీలుగా తీస్తే.. కాస్తో, కూస్తో గ్రిప్పింగ్ దొరికేది. రెండు చోట్లా.. కథ, కథనాల లేమి స్పష్టంగా కనిపించింది. దానికి తోడు ట్విస్టులూ, టర్న్‌లూ కొరవడ్డాయి. అన్నింటికంటే ముఖ్యంగా తమన్నా స్టార్ డమ్ ని ఆయా కథలు ఏమాత్రం వాడుకోలేకపోయాయి. కాల్షీట్లు ఉన్నాయి కదా అని తమన్నా ఇచ్చేస్తే, తమన్నా దొరికింది కదా అని ఏవో కొన్ని కథలు అల్లేసి వెబ్ సిరీస్‌లు తీసినట్టు కనిపించింది. మొత్తానికి తమన్నా చేసిన రెండు వెబ్ సిరీస్ లూ ప్లాపే. ఆ రకంగా ఓటీటీ అనేది తమన్నాకు కలసి రాలేదనే చెప్పాలి.