నందమూరి బాలకృష్ణ 101వ చిత్రం పూరి జగన్నాథ్‌తో ఖాయం అయిపోయింది. మార్చి 9న ఈ చిత్రానికి కొబ్బరికాయ్ కొట్టేస్తారు. ఏప్రిల్‌లో సినిమా మొదలెడతారు. సెప్టెంబరున ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని పూరి అప్పుడే ప్రకటించేశాడు. ఇప్పుడు కథానాయికల వేటలో పడిపోయింది చిత్రబృందం. ఈ చిత్రంలో ముగ్గురు కథానాయికలుంటారు. ఓ నాయికగా తమన్నా పేరు ఆల్మోస్ట్ కన్ఫామ్ అయిపోయింది. బాలయ్యతో తమన్నా ఆడిపాడడం ఇదే తొలిసారి. పూరి దర్శకత్వంలో అయితే ఇది వరకు కెమెరామెన్ గంగతో రాంబాబులో నటించింది తమ్మూ. ఇక మిగిలిన ఇద్దరి కోసం వేట మొదలైంది.
కొత్త కథానాయికల్ని ఇంట్రడ్యూస్ చేయడం, అనామకుల్ని స్టార్ హీరోయిన్లుగా మార్చడం పూరికి అలవాటే. ఈసారీ ముంబై నుంచి బాలయ్య కోసం ఓ కొత్త కథానాయికని దింపే పనిలో ఉన్నాడని టాక్. ఆ బాధ్యతని ఛార్మి తీసుకొందట. ప్రస్తుతం ఛార్మి కథానాయికల వేటలో ఉందని, త్వరలోనే ఓ కొత్త కథానాయికని ఇంట్రట్యూస్ చేయడం ఖాయమని చెబుతున్నారు. మరో నాయికగా ‘రోగ్’ భామ ఏంజెలాకి మరో అవకాశం ఇవ్వాలని పూరి భావిస్తున్నాడట. ఇద్దరు హీరోయిన్లలో ఏంజెలాకి చోటు దక్కడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. పూరి సినిమాలో ముగ్గురు కథానాయికలుండడం ఇదే తొలిసారి. దాన్ని బట్టి.. బాలయ్యలోని రొమాంటిక్ యాంగిల్ టచ్ చేయడానికి పూరి ప్రయత్నిస్తున్నాడేమో అనిపిస్తోంది. మార్చి తొలి వారంలో బాలయ్యకు పూరి ఫైనల్ నేరేషన్ ఇవ్వబోతున్నాడు. ఈలోగా కథానాయికలపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.