హ్యాపీ డేస్ నుంచి.. ఇప్పటి వరకూ తమన్నా చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే. ఫక్తు కథానాయిక పాత్రలే. కాకపోతే… 100%లవ్, కొంచెం ఇష్టం – కొంచెం కష్టం లాంటి సినిమాల్లో తన పాత్రలకు మంచి మైలేజీ వచ్చింది. ఆ పాత్రల్నీ కూడా ఈజీగా మంచి ఈజ్ తో చేసేసింది తమన్నా. అయితే తొలిసారి తమన్నాకు పరీక్ష ఎదురవ్వబోతోంది. టబు రూపంలో.
`అంధాధూన్`ని తెలుగులో రీమేక్ చేస్తున్నప్పుడు అందరిలో మెదిలిన ఏకైన ప్రశ్న… `టబు పాత్ర కోసం ఎవరిని తీసుకుంటున్నారు` అనే. ఎందుకంటే… `అంధాధూన్`కి ప్రధాన ఆకర్షణ, బలం.. టబు పాత్రే. ఆ పాత్రని దర్శకుడు మలుచుకున్న విధానం, అందులో టబు రాణించిన పద్ధతి ఆ విజయంలో కీలక పాత్ర పోషించాయి. దాంతో టబుని ఎవరితో రిప్లేస్ చేస్తారా? అనే ప్రశ్న మొదలైంది. నయనతార దగ్గర్నుంచి శ్రియ వరకూ.. అటు తిరిగి ఇటు తిరిగి – చివరికి తమన్నా దగ్గర ఆగింది చిత్రబృందం. నిజానికి ఈ పాత్రలో తమన్నాని ఎవరూ ఊహించలేదు. తమన్నా రాకతో.. ఈ సినిమాకి స్టార్ మైలేజీ అయితే వచ్చింది. కానీ… టబుని ఎంత వరకూ మరపిస్తుందన్నది ప్రశ్న.
తమన్నాకి ఉన్న ఇమేజ్ వేరు. ఆమె గ్లామర్ తార. నటించగలదు కూడా. కాకపోతే.. టబు పాత్ర లో ఎక్కువగా నెగిటీవ్ షేడ్స్ ఉంటాయి. కన్నింగ్ స్వభావం. వాటిని టబు బాగా పండించింది. ఈ రెండూ… తమన్నాకి కొత్తే. పైగా తమన్నా వల్ల ఈ పాత్రని ఏమైనా మార్చేస్తారా? అనే భయాలు మొదలయ్యాయి. ఎందుకంటే.. తమన్నా కచ్చితంగా భారీ పారితోషికాన్నే డిమాండ్ చేసి ఉంటుంది. అమెని వీలైనంత వాడుకోవడం దర్శక నిర్మాతల పని. అందుకే.. తమన్నా కోసం ఆ పాత్ర నిడివి మరింత పెంచే అవకాశం ఉంది. పైగా తమన్నా మంచి డాన్సర్. తన కోసం ఓ పాటని ఇరికించినా ఇరికించేస్తారు. ఇవన్నీ ఆ పాత్ర స్వభావాన్ని చెడగొట్టకుండా ఉంటాయా? అనే అనుమానాలు మొదలయ్యాయి. టబు పాత్రలో మార్పులు చేర్పులూ చేసినా, అవి కథకు మరింత బలాన్నిస్తే, తమన్నా ని మరింత ఎలివేట్ చేస్తే.. కచ్చితంగా ఈ రీమేక్ పండుతుంది. అది ఇప్పుడు దర్శకుడు మేర్లపాక గాంధీ చేతిలోనే ఉంది.