నార్త్ నుండి సౌత్ కు వచ్చిన చాలా మంది ముద్దుగుమ్మల అంతిమలక్ష్యం బాలీవుడ్ హీరోయిన్ గా వెలిగిపోవడమే. అదేం మోజో కానీ ఇక్కడ కోట్ల కొద్ది డబ్బు, స్టార్ హీరోయిన్ స్టేటస్, ఫ్యాన్స్ ఫాలోయింగ్.. ఇలా అన్ని వైభవాలు వున్నా బాలీవుడ్ లోనే స్థిరపడాలని తాపత్రయపడిపొతుంటారు. ”సౌత్ ఇండస్ట్రీనే మా ఫస్ట్ ఛాయిస్”అని బయటకి చెబుతారు కానీ ఎప్పుడు బాలీవుడ్ అవకాశం వస్తుందా ? అని ఎదురుచూస్తుంటారు. ఇలియానా, కాజల్, తమన్నా .. ఈ కోవలోకే వస్తారు. తెలుగులో ఓ వెలుగు వెలిగిపోతున్న సమయంలో ‘బర్ఫీ’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. మళ్ళీ తెలుగు పరిశ్రమ వైపు చూడనని ఓ స్టేట్మెంట్ కూడా వదిలింది. అయితే సీన్ రివర్స్ అయింది. ఇప్పుడు ఆమెకు అక్కడ అవకాశాలు లేవు. ఇక్కడ అంతా లైట్ తీసుకున్నారు. కనీసం ఐటెం పాటలకు కూడా కన్సిడర్ చేయడం లేదు. దీంతో ఫెడ్ అవుట్ స్టేజ్ కి వచ్చేసింది ఇలియానా.
కాజల్ కూడా అంతే. తొలుత బాలీవుడ్ లోనే ఎంట్రీ ఇచ్చింది కాజల్. ”క్యున్ హో గయా నా”.. సినిమాతో. అయితే తర్వాత అక్కడ అవకాశాలు రాలేదు. దీంతో టాలీవుడ్ వైపు చూసింది. ఇక్కడ టాప్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. దాదాపు స్టార్ హీరోలందరితోనూ జతకట్టేసింది. అయితే బాలీవుడ్ తాపత్రయం మాత్రం వదల్లేదు. సింగం తో మరో ప్రయత్నం చేసింది. ఇది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. తర్వాత స్పెషల్ చబ్బిస్. ఈ సినిమా హిట్ అయ్యింది కానీ ఆమెకు పెద్దగా కలసి రాలేదు. దీంతో మళ్ళీ టాలీవుడ్ లోనే సినిమాలు చేసుకుంది కాజల్. ఆమధ్యన ”దో లఫ్జోన్ కి కహాని’ అనే సినిమా చేసింది. ఇందులో అంధురాలి గా కనిపించింది. అయితే ఈ సినిమా కూడా ఎవ్వరికీ కనిపించకుండా పోయింది. దీంతో మళ్ళీ టాలీవుడ్ సినిమాలనే నమ్ముకుంది.
తమన్నా పరిస్థితి కూడా అంతే. బాలీవుడ్ లో తన స్థానం సుస్థిరం చేసుకోవడానికి తెగ తాపత్రయపడింది. తొలి సినిమా హిమ్మత్వాలా డిజాస్టర్. హమ్ షకల్స్తో మరో ఛాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా కూడా దారుణంగా పల్టీకొట్టేసింది. ఈ సినిమా తర్వాత మరో ఆఫర్ రాలేదు తమన్నాకి. దీంతో మళ్ళీ బ్యాక్ టు పెవిలియన్ అంటూ సౌత్ సినిమాలపై ద్రుష్టి పెట్టింది. అయితే తమన్నాకు మాత్రం బాలీవుడ్ కోరికలు ఇంకా చావలేదు. ఎలాగైనా బాలీవుడ్ లో సత్తా చాటుతా అంటోంది తమన్నా. ”కొన్ని హిందీ కధలు వుంటున్నా. అయితే ఇందులో నా నటనకు మంచి గుర్తింపు వచ్చే పాత్రలే చేస్తా. ఖచ్చితంగా బాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటా.”అని సెలవిస్తోంది తమన్నా. మరి, తమన్నా బాలీవుడ్ కోరిక ఎప్పటికి తీరేనో…