తమిళంలో బ్లాక్ బస్టర్ విజయాలు ఇచ్చిన దర్శకుడు… హరి. సింగం సిరీస్ తనకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ప్రస్తుతం విశాల్ తో `రత్నం` రూపొందిస్తున్నారు. సాధారణంగా తమిళంలో ఒకట్రెండు హిట్లు ఇచ్చిన దర్శకులు తెలుగు హీరోల కంట్లో పడడం, వాళ్లతో సినిమాలు తీయడం పరిపాటే. కానీ హరి మాత్రం ఎందుకనో తెలుగు హీరోల దృష్టిలో పడలేకపోయాడు. కొన్ని కథలు సిద్ధం చేసి, తెలుగు హీరోల్ని సంప్రదించినా ఎందుకో కుదర్లేదు. ఇప్పుడు మళ్లీ తెలుగులో తన ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఈసారి ఏకంగా ఆయన చిరంజీవిపైనే గురి పెట్టారు.
అవును..చిరు కోసం హరి ఓ కథని సిద్ధం చేసినట్టు ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓ నిర్మాతని సైతం పట్టుకొన్నారు. ఇప్పుడు కథని చిరంజీవికి వినిపించడమే తరువాయి. `విశ్వంభర` తరవాత చిరు లైనప్లో ఉన్న సినిమాలేం కనిపించడం లేదు. హరీష్ శంకర్, అనిల్ రావిపూడి లాంటి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. కానీ ఏదీ ఖరారు కాలేదు. హరితో సినిమా చేయడానికి చిరుకి ఎలాంటి అభ్యంతరం లేకపోవొచ్చు. ఎందుకంటే… ఓ హీరోని ఎలా చూపించాలో హరికి బాగా తెలుసు. మాస్, యాక్షన్ చిత్రాలకు హరి పెట్టింది పేరు. చిరుకి కథ నచ్చాలంతే!