తెలుగులో ఇది వరకు హీరోయిన్ల కొరత మాత్రమే ఉండేది. ఇప్పుడు అలా కాదు. హీరోలు సైతం దొరకడం లేదు. పెద్ద దర్శకులు, హిట్లు కొట్టిన వాళ్లు… హీరోలు లేక సతమతమవుతున్నారు. ఈలోగా… పరాయి దర్శకులు తెలుగు గడ్డపై అడుగుపెట్టి, తమ హవా చూపించడం మొదలెడుతున్నారు. ఈమధ్య మన హీరోలకు పొరుగింటి దర్శకులపై గురి కుదురుతోంది. వాళ్లతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
కేజీఎఫ్ తో ఆకట్టుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఈ దర్శకుడు టాలీవుడ్ కి మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. ప్రభాస్ తో `సలార్` ని పట్టాలెక్కిస్తున్న ప్రశాంత్…. రామ్ చరణ్, ఎన్టీఆర్‌లను లైన్ లో పెట్టాడు. ఆ తరవాత అల్లు అర్జున్ క్యూలో ఉన్నాడు. ఈ మూడు ప్రాజెక్టులు పూర్తయ్యేసరికి మరో నాలుగేళ్లయినా పడుతుంది. అంటే… నాలుగేళ్ల పాటు, ప్రశాంత్ నీల్ కేరాఫ్ అడ్రస్స్ టాలీవుడ్ అన్నమాట.
ఖైదీతో తనదైన ముద్ర వేసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఆ సినిమా చూసి టాలీవుడ్ హీరోలు లోకేష్‌కి ఫ్యాన్స్ అయిపోయారు. ఫోన్లు చేసి కథలు వినిపించమన్నారు. ఇద్దరు ముగ్గురు స్టార్ హీరోలు లోకేష్ కి టచ్‌లోనే ఉన్నారు. లోకేష్ తదుపరి సినిమా.. టాలీవుడ్ హీరోతోనే. అదెవరన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. లోకేష్ కనుక సరైన కథలతో వస్తే.. బడా హీరోలు డేట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు బంతి.. లోకేష్ కోర్టులోనే వుంది.
పందెంకోడి సినిమాతో రచ్చ చేశాడు లింగుస్వామి. ఆ సమయంలోనే టాలీవుడ్ నుంచి తనకు ఆఫర్లు వెళ్లాయి. కానీ ప్రాజెక్టేం సెట్ కాలేదు. లింగు స్వామి ఇప్పుడు ఫ్లాపుల్లో ఉన్నాడు. కానీ మన హీరోల నమ్మకం సడల్లేదు. రామ్ తో ఓ సినిమా ఓకే చేయించుకున్నాడు. ఇక కెరీర్లో ఇప్పటి వరకూ తెలుగులో ఒక్క స్ట్రయిట్ సినిమా కూడా చేయలేదు శంకర్. అలాంటిది రామ్ చరణ్‌తో సినిమా ఓకే అయ్యింది. ఇది కూడా దాదాపు 200 కోట్ల బడ్జెట్ డిమాండ్ చేసే కథే. మురుగదాస్ ఓ కథ పట్టుకుని టాలీవుడ్ అంతా తిరుగుతున్నాడు. బన్నీతో ఓకే అవ్వాల్సిన సినిమా అది. ఇప్పుడు రామ్ చేతుల్లోకి వెళ్లిందని తెలుస్తోంది. మొత్తమ్మీద ఎలా చూసినా, తమిళ దర్శకుల హవా టాలీవుడ్ లో బాగానే కనిపిస్తోంది. తెలుగు, తమిళం ఇలా రెండు మార్కెట్లనీ కవర్ చేద్దామనుకుంటున్న టాలీవుడ్ హీరోలకు.. తమిళ దర్శకుల్ని ఎంచుకోవడం మంచి ఆప్షన్ కూడా. మరి.. ఈ జోరు ఎంతకాలమో చూడాలి.