కరోనా కారణంతో థియేటర్లు మూతబడడంతో సినిమాలన్నీ ఓటీటీ వైపు చూడక తప్పలేదు. అయితే.. తమిళనాట ఓటీటీ వైపు అడుగులేసిన పెద్ద హీరో సూర్యనే. తన నిర్మాణ సంస్థలో రూపొందించిన `పొన్మగల్ వందాల్` ని ఓటీటీకి ఇచ్చేశాడు. అప్పట్లో పెద్ద గొడవే జరిగింది. `ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయాలి` అంటూ డిస్టిబ్యూటర్లూ, ఎగ్జిబ్యూటర్లూ సూర్యకు అల్టిమేట్టం జారీ చేశారు. అలా కాని పక్షంలో.. భవిష్యత్తులో సూర్య నటించిన ఏ సినిమానీ థియేటర్లలో విడుదల చేయనివ్వం అంటూ హెచ్చరించారు.
కానీ సూర్య వెనకడుగు వేయలేదు. `నా సినిమా నాఇష్టం` అంటూ తనకు తోచిన దారిలోనే వెళ్లాడు. `ఈ సినిమా ఇప్పుడు విడుదల కాకపోతే.. అప్పుల పాలైపోతాను. అవన్నీ మీరు తీరుస్తారా` అంటూ ఎదురు దాడి చేశాడు. దాంతో.. వ్యవహారం సద్దుమణిగింది. ఇప్పుడు సూర్య నటించిన `ఆకాశమే నీ హద్దు` సినిమానీ ఓటీటీకే ఇచ్చేశాడు. దాంతో.. మరోసారి తమిళ నాట మరోసారి సూర్యపై విరుచుకుపడుతున్నారు అక్కడి పంపిణీదారులు.
దానికి తోడు తమిళనాడు మంత్రి కడంబూర్ రాజు కూడా సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓటీటీలో సినిమాని విడుదల చేయకూడదని, అలా చేస్తే.. థియేటర్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందని, సూర్య లాంటి పెద్ద హీరోలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిత్రసీమ దారుణంగా నష్టపోతుందని, ఈ విషయంలో సూర్య ఆలోచించుకోవాలని సలహా ఇచ్చారు. సాక్షాత్తూ మంత్రి గారే… సూర్య నిర్ణయాన్ని తప్పుబట్టడంతో అక్కడి సూర్య వ్యతిరేక వర్గం రెచ్చిపోతోంది. చిత్రసీమను కాపాడుకోవాలన్న ఉద్దేశం సూర్యకు లేదని, తన లాభమే చూసుకుంటున్నాడని వాడీ వేడీ విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటినీ సూర్య లైట్ తీసుకుంటున్నాడు. కాకపోతే.. అందరికీ త్వరలోనే గట్టిగా సమాధానం ఇవ్వాలని భావిస్తున్నాడట. ఈసారి సూర్య ఎలాంటి ఎదురు దాడి చేస్తాడో చూడాలి.