ఈ దీపావళికి టాలీవుడ్ లో కొత్త సినిమాల కళ కనిపించబోతోంది. తెలుగు నుంచి లక్కీ భాస్కర్, క సినిమాలు వస్తున్నాయి. వాటితో పాటు అనువాద చిత్రాలు అమరన్, బఘీర చిత్రాలూ పలకరించబోతున్నారు. బఘీర కన్నడ యాక్షన్ చిత్రం. అమరన్ తమిళం నుంచి వస్తోంది. తెలుగు నాట ఈ రెండు డబ్బింగ్ చిత్రాలకూ థియేటర్లు దొరికాయి. అయితే విచిత్రం ఏమిటంటే… తమిళ నాట ‘క’ చిత్రానికి థియేటర్లు ఇవ్వడం లేదు. అడిగితే… ‘మా సినిమాలు ఉన్నాయి. మీకెలా ఇస్తాం’ అని నిలదీస్తున్నారు. అంటే తమిళ అనువాదాలు తెలుగులో హాయిగా రిలీజ్ చేసుకోవొచ్చు. తెలుగు సినిమాలకు మాత్రం తమిళంలో చోటు దక్కదు. ఇదేం స్వార్థం.
‘లక్కీ భాస్కర్’కు తమిళ నాట మంచి థియేటర్లే దొరికాయి. కానీ ‘క’దే అసలు సమస్య. తమిళం నుంచి ఎప్పుడు ఎన్ని సినిమాలొచ్చినా, తెలుగులో మంచి థియేటర్లు దొరుకుతున్నాయి. కావల్సినన్ని థియేటర్లు ఇస్తున్నారు. తెలుగు నుంచి తమిళంలోకి వెళ్లినప్పుడు మాత్రం వాళ్లకు రూల్స్ గుర్తొస్తున్నాయి. దీపావళి మనకంటే.. తమిళ వాళ్లకే పెద్ద పండగ. అక్కడ సినిమాలూ గట్టిగా విడుదల అవుతాయి. దాన్ని కాదనలేం. కానీ…తెలుగు సినిమాలకూ ఎన్నో కొన్ని థియేటర్లు ఇవ్వొచ్చు కదా. అక్కడ థియేటర్లు లేని కారణంగా ‘క’ తమిళ నాట వారం ఆలస్యంగా విడుదల చేయాల్సివస్తోంది.
సంక్రాంతి మనకు పెద్ద సీజన్. అప్పుడు తెలుగు సినిమాలు ఎక్కువగా రిలీజ్ అవుతాయి. తమిళం నుంచి కూడా ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ వస్తోంది. సంక్రాంతి మనకు పెద్ద పండగ కదా అని ఆ సినిమాకు థియేటర్లు ఇవ్వకపోతే? అప్పుడు అర్థమవుతుంది తెలుగు నిర్మాతల బాధ. సంక్రాంతికి తమిళ డబ్బింగులను అడ్డుకోవాలి. సంక్రాంతికి మాత్రమే కాదు, తెలుగులో పెద్ద సినిమాలు జోరుగా విడుదల అవుతున్నప్పుడు సందట్లో సడేమియాలా డబ్బింగ్ సినిమాలూ వస్తుంటాయి. అలాంటప్పుడు వాటికి చెక్ పెట్టాల్సిందే. ఈ విషయంలో ఛాంబర్ సరైన నిర్ణయం తీసుకోవాలి. గతంలోనూ ఇలాంటి ప్రయత్నం చేశారు. సంక్రాంతి సీజన్లో డబ్బింగ్ సినిమాలకు చోటు లేదని తేల్చారు.కానీ మధ్యలో కొంతమంది స్వార్థ ప్రయోజనాల వల్ల అది కాస్త గాలికి కొట్టుకెళ్లిపోయింది. ఈ సంక్రాంతి సీజన్లో అయినా డబ్బింగ్ సినిమాల్ని, ముఖ్యంగా తమిళ డబ్బింగుల్ని ఆపేందుకు ప్రయత్నించాలి.