“డబ్బింగ్” సినిమాలకు తెలుగు పేర్లు పెట్టేవారు. సినిమాలో, ఇతర భాషలలో ఉండే బోర్డు లని తెలుగులోకి చక్కగా మార్చేవారు. అది కూడా మానేసి విడుదల చేస్తున్నారు. వారి వారి భాష లలో వారి గొప్పదనాన్ని, కళాత్మకతని గౌరవిస్తాను. కానీ, తెలుగు ప్రేక్షకులని ఇంత తేలికగా తీసుకోవడం నచ్చట్లేదు. తెలుగు ని గౌరవించని వాళ్ళని కూడా తెలుగువాళ్లు గౌరవించడం, ఆదరించడం, ఆ చిత్రాలని చూడ్డానికి మన డబ్బులు ఖర్చుపెట్టడం మన గొప్పతనం అని మాత్రం నేను అనుకోవట్లేదు’
ఇటీవల రచయిత అబ్బూరి రవి ట్విట్టర్ లో పెట్టిన పోస్ట్ ఇది. ఈ పోస్ట్ లో న్యాయం వుంది. ఆయన ఆవేదనలో అర్ధం వుంది. ఎంత భాషాభిమానం వున్నా ఈ స్థాయిలో అరవ టైటిళ్ళు తెలుగు ప్రేక్షకులపై రుద్దేయడాన్ని అస్సలు ప్రోత్సహించకూడదు.
ఒక తెలుగు టైటిల్ పెట్టుకోవడానికి వాళ్ళకి వున్న ఇబ్బంది ఏమిటో అర్ధం కాదు. తెలుగు డబ్బింగ్ క్వాలిటీ కొన్ని సినిమాలు మరీ నాసిరంగా ఉంటున్నాయి. కొన్ని సినిమాలకు టైటిల్ కార్డ్స్ చూస్తే తెలుగు ప్రేక్షకుడంటే వాళ్లకి ఎంత చులకనో అర్ధమౌతుంది.
టైటిల్స్ అన్నీ గూగల్ ట్రాన్స్ లేషన్ లో వేసి గూగల్ ఏది కన్వర్ట్ చేస్తే ఆ పదమే యధాతగంగా వాడేస్తున్నారు. తెలుగు తెలిసినవారితో రీ-చెక్ చేసుకోవాలనే కనీస స్పృహ వుండటం లేదు. (ధనుష్ కెప్టెన్ మిల్లర్ తెలుగు టైటిల్స్ ఒకసారి పరిశీలించవచ్చు) తెలుగు పట్ల ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో అర్ధమౌతుంది. రజనీకాంత్ సినిమా ‘వేట్టయాన్పై’ కూడా గట్టి విమర్శలే ఉన్నాయి. రజనీలాంటి వాడు కూడా తన సినిమాని తెలుగులో విడుదల చేస్తున్నప్పుడు తెలుగు పేరు పెట్టాలన్న ఆలోచన చేయకపోవడం వింతగానూ విడ్డూరంగానూ ఉంది. అసలు ఇలాంటి సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎందుకు చూడాలి? ఎందుకు ప్రోత్సహించాలి? అనే ప్రశ్న ఎదురవుతోంది.
ఇలాంటి సమయంలోనే ఇంకో తమిళ్ టైటిల్ ని వెక్కిరిస్తున్నట్లు తెలుగు ప్రేక్షకులు మీదకి వదిలారు. నటుడు జీవా ఓ ఫాంటసీ సినిమా చేస్తున్నాడు. దీనికి టైటిల్ ‘Aghathiyaa’ అంట. దీన్ని మనకి నచ్చినట్లు తెలుగు మార్చుకొని పబ్లిష్ చేసుకోవాలన్నమాట. ఇలాంటి అఘాయిత్యాలు తెలుగు ప్రేక్షకులు ఇంకెన్ని చూడాలో.
ఈమధ్య కార్తి సినిమా ‘సత్యం.. సుందరం’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు మంచి స్పందన దక్కింది. డబ్బింగ్ క్వాలిటీ కూడా భేషుగ్గా ఉంది. తమిళ బోర్డులు ఎక్కడా కనిపించలేదు. ప్రతీ చోటా.. తెలుగుదనం ఉట్టిపడింది. టైటిల్ కూడా తెలుగు ప్రేక్షకుల కోసం అచ్చమైన తెలుగులో పెట్టారు. ఇలా మిగిలినవాళ్లు ఎందుకు ప్రయత్నించకూడదు? అనేదే బాధ.