టెన్త్ పరీక్షల ఫలితాలు అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే వస్తున్నాయని ఏపీలో మాత్రమే తక్కువ కాదని ప్రభుత్వం వాదిస్తూ వస్తోంది. దానికి గుజరాత్‌ను సాక్ష్యంగా చూపించారు సీఎం జగన్. సోమవారమే పొరుగున ఉన్న తమిళనాడు పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. టెన్త్‌లో 90 శాతం.. ఇంటర్లో 93 శాతం విద్యార్థులు పాసయ్యారు. నిజానికి తమిళనాడు విద్యార్థులు ఆ స్థాయిలో ఎప్పుడూ పాసవుతూ ఉంటారు. కరోనా కారణంగా అక్కడా రెండేళ్ల పాటు పరీక్షలు జరగలేదు.. సరిగ్గా క్లాసులు జరగలేదు. అయినప్పటికీ అక్కడి ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించింది. విద్యార్థులకు మేలు చేసింది.
కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం టెన్త్ ఫలితాలు 67 శాతం రావడం అసాధారణం ఏమీ కాదని చెబుతోంది. ఏపీలో విద్యా ప్రమాణాలు గత రెండు దశాబ్దాల్లో పాగా పెరిగాయి. ఒకప్పుడు 70 వరకూ ఉండే పాస్ పర్సంటేజీ ఆ తర్వాత 95 శాతం వరకూ చేరింది. అయితే ఒక్క సారిగా అక్కడ్నుంచి ఇరవై శాతం వరకూ పడిపోవడం చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. కరోనాను కారణంగా చూపించినప్పటికీ.. అసలు కారణం విద్యా సంస్థల్లో టీచర్లు లేకపోవడం.. ప్రభుత్వం వారికి టీచింగ్ పనులు కాకుండా ఇతర పనులు చెప్పడం వల్ల వచ్చిన సమస్యలని విమర్శిస్తున్నారు.
అయితే ప్రభుత్వం తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకునేందుకు సిద్ధపడటం లేదు. ఫెయిలయిన విద్యార్థులకు సప్లిమెంటరీ నిర్వహించి డైరక్ట్‌గా పాసయినట్లుగా సర్టిఫికెట్లు ఇస్తామని చెబుతోంది. అదే పరిష్కారం అనుకుంటోంది. ప్రభుత్వం అసలు మౌలిక సమస్య ఎక్కడో గుర్తించి పరిష్కారానికి ప్రయత్నించకుండా.. బాగా తక్కువ ఫలితాలు వచ్చే రాష్ట్రాలతో పోల్చుకుని సంతృప్తి పడేది భావి పౌరులకే నష్టం వాటిల్లుతుంది.