తమిళనాడు బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేటీ రాఘవన్ అనే నేత తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇంటలెక్చువల్‌గా తమిళనాడులో చెలామణి అవుతుంటారు. చర్చలు పెడుతూంటారు. అయితే బ్యాక్ గ్రౌండ్లో మాత్రం ఆయన మహిళా నేతలతో అర్థనగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడుతూ దారుణమైన భాషను ప్రయోగిస్తూ ఉంటారు. ఈ వీడియోను తనకు తాను బీజేపీ నేతగా ప్రకటించుకున్న మదన్ రవీంద్రన్ అనే వ్యక్తి బయట పెట్టారు. దీంతో తమిళనాడులో గగ్గోలు రేగింది.
అనేక చానళ్లు చర్చా కార్యక్రమాలు నిర్వహించాయి. బయట పడిన వీడియో కాల్లో ఉన్నది జిల్లాకు చెందిన మరో మహిళా బీజేపీ నేతే. బీజేపీ మహిళా నేతలతో కేటీ రాఘవన్ అసభ్యంగా ప్రవర్తిస్తూంటారని ఆయన ప్రవర్తన రోజు రోజుకు మితిమీరిపోతున్నందునే వీడియోను బయట పెట్టానని మదన్ చెబుతున్నారు. చాలా మంది కుటుంబాలను రాఘవన్ నాశనం చేశారని ఆయన అంటున్నారు. తమిళనాడు బీజేపీకి చెందిన 15 మంది నేతలకు సంబంధించిన ఇలాంటి అసభ్యకర వీడియోలు ఉన్నాయని.. సీరియల్‌గా ఈ ఏడాది మొత్తం విడుదల చేస్తూనే ఉంటానని ప్రకటించారు.
మొత్తం 60 వీడియోలు ఉన్నాయని చెబుతున్నారు. మొదట తనపై బురద చల్లుతున్నారని ఆరోపించిన రాఘవన్ తరవాత బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. తక్షణం చర్యలు తీసుకోవాలని పలు పార్టీల మహిళా నేతలు తమిళనాడు డీజీపికి ఫిర్యాదులు చేశారు.