ఇప్పటి వరకూ రచయితలపైన పాత్రికేయులపైన మాత్రమే దాడి చేస్తున్న బిజెపి కొత్తగా వాణిజ్య చిత్రాలపై చూపు సారించింది. తమిళ హీరో విజయ్ తాజా చిత్రం మెర్సెల్స్ అఖండ విజయం సాధించి మొదటి రోజే 51 కోట్లు వసూలు చేసుకోవడం బిజెపికి కంటగింపుగా మారింది. ఏమంటే ఆ చిత్రంలో నోట్లరద్దు డిజిటల్ ఇండియా వంటివాటిని దర్శకుడు అట్లీ ఏకిపారేశాడట. నోట్లరద్దు వంటి అనాలోచిత చర్యలు ప్రజల జీవితాలపై చూపే ప్రభావాన్ని గురించిన డైలాగులకు చాలా స్పందన రావడంతో రాష్ట్ర బిజెపి నేతలు వెంటనే ఆ సన్నివేశాలు సంభాషణలు తొలగించాలని ఫిర్యాదులు మొదలుపెట్టారు. తమిళనాడు బిజెపి అద్యక్షుడు సౌందరరాజన్ ఈ చిత్రం జిఎస్టి గురించి తప్పు అభిప్రాయం కలిగిస్తుందని ఆరోపించారు. ఆ పార్టీ యువజన విభాగం సింగపూర్‌తో పోలిక సరిగ్గా లేదని తప్పుపట్టారు.మరోవైపున చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది గనక రీ సెన్సారింగ్ అవసరం లేదని కమల్‌హాసన్ ట్వీట్ చేశారు. అలాగే అభిమానులు చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. మళయాలంలో బాహుబలికన్నా ఈ చిత్రం ఎక్కువ ధియేటర్లలో విడుదలైంది. తెలుగులోనూ అదిరింది పేరుతో రాబోతున్నది. ఇటీవల తమిళం నుంచి తెలుగులోకి చిరంజీవి రీమేక్ ఖైదీ నెంబర్ 150. రామ్‌చరణ్ రీమేక్ ధృవ కూడా రాజకీయ కోణాలున్నా సమస్యలను చూపించాయి. మెర్సల్స్ అలాగాక మోడీ పథకాల ప్రచారాన్నే అపహాస్యం చేయడం బిజెపి భరించలేకపోతున్నది