తమిళనాడు రాజకీయాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు పడి ఉన్నాయి! రోజులు గడుస్తున్నా… ఒక అడుగు ముందుకు సాగడం లేదు.. ఒక అడుగు వెనక్కీ వెళ్లడం లేదు! పరిస్థితి అంతా గవర్నర్ విద్యాసాగర రావు అదుపులోనే ఉందని చెప్పాలి. ఆయన్ని నడిపిస్తున్నది కేంద్రంలోని భాజపా సర్కారు అనేది అందరికీ తెలిసిన రహస్యమే! అయితే, గవర్నర్ తీరు చూస్తుంటే… మరికొన్నాళ్లు ఈ నాన్చుడు ధోరణి తప్పేట్టు లేదనే అనిపిస్తోంది. ఆయన లక్ష్యం… చాలా క్లియర్! పన్నీర్ సెల్వమ్కి బలం పెరిగే వరకూ మౌనంగా ఉండేట్టుగా కనిపిస్తోంది.
అయితే, ఒక రాష్ట్ర రాజకీయాలు అనిశ్చితిలో పడ్డప్పుడు పెద్దన్న పాత్ర పోషించాల్సిన గవర్నర్, ఇలా కేంద్రంలోని అధికార పార్టీకి కొమ్ము కాయడం ఎంతవరకూ సబబు అనేది అసలు ప్రశ్న? నిజానికి, ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వమ్ రాజీనామా చేయడం, దాన్ని గవర్నర్ ఆమోదించడం కూడా జరిగిపోయింది. శశికళ ఎమ్మెల్యే కాకపోయినా… అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఆమెను నాయకురాలుగా ఎన్నుకున్నారు. కాబట్టి, ప్రభుత్వ ఏర్పాటుకు ఆమెను పిలవాల్సిన బాధ్యత గవర్నర్‌ది. కానీ, పన్నీర్ ఎదురు తిరిగిన దగ్గర నుంచీ గవర్నర్ ఆయనవైపే మొగ్గుచూపుతున్నారు.
మనసు మార్చుకున్న పన్నీర్.. తానే సీఎంగా ఉంటానని చెబుతున్నారు. కానీ, ఒకసారి రాజీనామా చేసి, ఆమోదం పొందాక ఇలా మనసులు మార్చుకోవడాలు రాజ్యాంగ ప్రకారం చెల్లవు! తూచ్… తొండీ.. అంటే కుదరదు. తన రాజీనామాను వెనక్కి తీసుకుంటానంటే… అది జరిగే పనికాదని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే ఎన్నుకున్న శాసన సభ పక్ష నేతగా శశికళను ప్రభుత్వ ఏర్పాటుకు పిలవాలి. ఎందుకంటే, తన దగ్గర మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్నారని ఆమె చెబుతూనే ఉన్నారు కదా! అదే మాట పన్నీర్ చెప్పడం లేదు. తన దగ్గర ఎంతమంది ఎమ్మెల్యేలున్నారో ఇంతవరకూ ప్రకటించలేదు.
ఈ తరుణంలో శశికళకు ఛాన్స్ ఇచ్చీ… బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ పిలవాలి! ఆ పనీ చేయడం లేదు! ఎందుకంటే, పన్నీర్ గెలుపునకు కావాల్సిన బలం సమకూరలేదు కదా. రేప్పొద్దున్న సుప్రీం కోర్టులో ఏదో తీర్పు వస్తుంది కదా… ఆ తీర్పు చూసుకున్నాకనే ఆమెని పిలుద్దాం అని వేచి ఉంటున్నట్టు గవర్నర్ చెబుతున్నా.. అది భాజపా ఆడిస్తున్న రాజకీయ డ్రామాగా అర్థమౌతూనే ఉంది.
మొత్తానికి, గవర్నర్ వ్యవస్థపైనే మరోసారి చర్చ జరిగేలా చేస్తున్న సందర్భం ఇది. కేంద్రంలోని అధికార పార్టీకి రబ్బర్ స్టాంప్‌లా రాష్ట్ర గవర్నర్లు పనిచేస్తుంటే… రాజ్యాంగ స్ఫూర్తి ఎక్కడున్నట్టు..? పార్టీలు అధికారం మారుతున్నప్పుడల్లా… తమ అనుంగు నాయకుల కోసం గవర్నర్లను మార్చేస్తున్న తీరు చూశాం. తమకు విధేయులు ఉన్నవారిని నియమించుకున్న వైనాన్నీ చూస్తున్నాం. ఆ మధ్య ఢిల్లీలో ఇదే జరిగిందీ… ఇప్పుడు తమిళనాడులో అదే జరుగుతోంది! ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలిగే మ్యాజిక్ ఫిగర్ పన్నీరుకు దక్కే వరకూ… తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు మౌనంగానే ఉంటారేమో! కాదు కాదు… భాజపా ఆయన్ని మౌనంగా ఉండమని చెప్తున్నదేమో!