జయలలిత కన్ను మూసినప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో దాదాపుగా ప్రతీ రోజు క్లైమాక్సే జరుగుతోంది. అన్నీ జరిగిపోతున్నాయి. కానీ ఏమీ జరగనట్లే అక్కడి రాజకీయం ఉంటోంది. గురువారం తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం ఏదో రాబోతున్నట్లు హడావుడి చేశారు. దినకరన్ వర్గానికి చెందిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు పై హైకోర్టు తీర్పు చెప్పబోతోందని… మళ్లీ పళనీ ప్రభుత్వానికి గండం వచ్చిందని హడావుడి జరిగింది. కానీ తీర్పు వచ్చింది. కానీ ఆ తీర్పు ప్రభుత్వంపై కానీ.. ప్రభుత్వ మనుగడపై కానీ చూపే ప్రభావం పెద్దగా ఏమీ లేదు. అంటే యథాతథ స్థితి.
“అమ్మ” మరణం తర్వాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కొద్ది రోజులకే సెల్వం స్థానంలో తాను కూర్చోవాలని చిన్నమ్మ శశికళ ఉబలాటపడ్డారు. ఫలితం.. ఆమె నేరుగా అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లి కూర్చోవాల్సి వచ్చింది. ఇలా జరిగినా.. పన్నీర్ సెల్వం కుర్చీ నిలిచిందా అంటే లేదు. శశికళపై తిరుగుబాటు చేసి.. పన్నీర్ సెల్వం హీరోగా నిలిచారు. కానీ క్యాంప్ రాజకీయాల్లో శశికళ అండతో దినకరన్… పళనీస్వామిని ముఖ్యమంత్రిని చేసేశారు. ప్రజల నుంచి వచ్చిన సపోర్ట్ తో పన్నీర్ సెల్వం కొంత మంది ఎమ్మెల్యేలను ఆకర్షించగలిగారు. ఆ తర్వాత ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో ఈసీకి లంచం ఇవ్వబోయారంటూ.. దినకరన్ ను టార్గెట్ చేశారు. కొన్నిరోజులు జైల్లో ఉంచారు. ఓటర్లకు … డబ్బులు పంచినట్లు.. మంత్రులపై ఆరోపణలు వచ్చేలా చేసి… ఐటీ, ఈడీలతో సోదాలు చేయించి… ఎలగైతేనేమి.. దినకరన్‌ను బయటకు పంపేలా చేయడంలో బీజేపీ సక్సెస్ అయింది.
ఆ తర్వాత పన్నీర్ – పళనీలను దగ్గరకు చేసింది. మరి దినకరన్ ఊరుకుటండా.. తాను సొంతంగా కొంత మంది ఎమ్మెల్యేలను పట్టుకుపోయాడు. వాళ్లు పద్దెనిమిది మంది. ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచి.. సొంత పార్టీ కూడా పెట్టుకున్నారు. డీఎంకే అవిశ్వాసం పెట్టి… దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు అనుకూలంగా ఓటు వేశారంటే ప్రభుత్వం పడిపోవడం ఖాయం. అందుకే స్పీకర్ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలపై ముందుగానే అనర్హతా వేటు వేశారు. వారంతా హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు విచారణ జరిపి తీరిగ్గా.. తీర్పు ఇచ్చింది. ఇద్దరు న్యాయమూర్తుల్లో ఒకరు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తే.. మరొకరు వ్యతిరేకించారు. మళ్లీ దీన్ని విస్త్రత ధర్మాసనానికి రిఫర్ చేశారు. అంటే.. కేసు చాలా ముందుకు కదిలింది కానీ.. ఎక్కడిది అక్కడే ఉన్నట్లు లెక్క. మళ్లీ విస్త్రత ధర్మానసం విచారంచి… మళ్లీ తీర్పు ఎప్పుడు చెబుతారో ఎవరూ ఊహించలేరు. తమిళనాడులో జరుగుతున్న ఈ రాజకీయ సినిమాకు కర్త, కర్మ, క్రియ బీజేపీనే. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి.