తమిళనాడు రాజకీయాల్లో ఇంకా హైడ్రామా కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పళని స్వామి వర్గం, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్ వర్గాల కలయిక లాంఛన ప్రాయమే అంటున్నారు. గత కొద్దిరోజుగా ఎడతెరపి లేకుండా జరుగుతున్న చర్చలు ఓ కొలీక్కి వచ్చినట్టు చెబుతున్నారు. నిజానికి, గతవారంలోనే ఈ విలీన ప్రక్రియ పూర్తవుతుందని అనుకున్నారు. చెన్నైలోని మెరీనా సాగరతీరంలో ఉన్న అమ్మ జయలలిత సమాధిని కూడా అలంకరించేశారు. కానీ, చివరి నిమిషంలో విలీనానికి మరింత సమయం తీసుకుంటామంటూ ఇరు వర్గాలు వెనక్కి తగ్గాయి. ఈ రెండు వర్గాల మధ్యా పదవుల పంపకాలపైనే జీడిపాకం చర్చలు కొనసాగుతూ వచ్చాయి. ప్రస్తుతానికి ఓ క్లారిటీ వచ్చేసిందనీ, సోమవారం నాడు మంచి ముహూర్తం ఉందనీ, రెండు వర్గాలూ అమ్మ సమాధి సాక్షిగా ఒకటైపోతాయని తమిళనాడులో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రెండు వర్గాల మధ్యా ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ప్రకటించారు. దీంతో సోమవారం నాడు అధికారికంగా ఏదో ఒక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఇక, పదవుల విషయానికి వస్తే.. పన్నీరుకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వబోతున్నారు. దీంతోపాటు ప్రజా పన్నుల శాఖ కావాలని కూడా ఆయన పట్టుబడుతున్నారట. ఈ డిమాండ్లకు ముఖ్యమంత్రి పళని అంగీకరించారని సమాచారం. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి విషయంలో మొదట్నుంచీ పన్నీరు పట్టుదలతో ఉన్నారు. అయితే, ముఖ్యమంత్రి విన్నపం మేరకు ఆయన ఓ మెట్టు దిగారనీ, ఆ విషయమై విలీనం తరువాత మాట్లాడుకుందామని ఒప్పించినట్టు చెబుతున్నారు. వర్గాల విలీనంతోపాటు ఎన్డీయేలో కలయిక విషయమై కూడా ఒక స్పష్టత ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం నాడు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చెన్నై రాబోతున్నారు. దీంతో ఆ లాంఛనం కూడా పూర్తయిపోతుందని అంటున్నారు.
విలీన ప్రక్రియ చివరి దశకు చేరుకోవడంతో చిన్నమ్మ వర్గంలో కలవరం మొదలైందని సమాచారం. దినకరన్ వర్గంలో నిన్నటి వరకూ 19 మంది శాసన సభ్యులు ఉండేవారు. వారితో ఇటీవలే బల ప్రదర్శన ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే, ఈ రెండు వర్గాల కలయిక నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేల సంఖ్య ప్రస్తుతం మూడుకు పడిపోయిందని తెలుస్తోంది. పార్టీలో తన ఆధిపత్యం తగ్గుతోందనీ, దీన్ని గాడిలో పెట్టాలంటే శత్రుసంహార యాగం చేయాలని శశికళ సూచించిందట! శివగంగ జిల్లాలోని పెరుమాళ్ల ఆలయంలో ఈ యాగం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ యాగం పూర్తయితే పార్టీపై పట్టు దినకరన్ కు వస్తుందని ఆయన నమ్మకం!