తమిళనాడులో మొన్నటి వరకు ఉన్న రాజకీయం ఇప్పుడు ఢిల్లీలో కనపడబోతుంది. కేజ్రీవాల్ సీఎం కుర్చీ ఖాళీ చేయటంతో… అతిశీ రాజకీయం తమిళనాడును గుర్తు చేస్తోంది.
గతంలో తమిళనాడు సీఎంగా ఉన్న జయలలిత కుర్చి ఖాళీ చేయాల్సి వచ్చినప్పుడు పన్నీరు సెల్వంకు ఛాన్స్ దక్కింది. అప్పుడు కూడా జయలలిత వాడిన కుర్చీని పన్నీరు సెల్వం వాడే వారు కాదు. ఆ తర్వాత పళనిస్వామి సీఎం అయ్యాక కూడా ఇలాంటి దృశ్యాలే కనిపించేవి.
ఇప్పుడు ఈ సీన్స్ ఢిల్లీలో కనిపిస్తున్నాయి. ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ రాజీనామా చేసి, తాను అవినీతిపరుడిని కాదు అని తేలాకే సీఎం అవుతానని మాటిచ్చారు. దీంతో తనకు నమ్మకస్తురాలిగా ఉన్న అప్పటి విద్యాశాఖ మంత్రి అతీషికి సీఎంగా ఛాన్స్ ఇచ్చారు.
తాజాగా పదవీ బాధ్యతలు తీసుకున్న సీఎం అతీషి… మొన్నటి వరకు సీఎంగా కేజ్రీవాల్ వాడిన కుర్చీని వాడటం లేదు. ఆ కుర్చీని పక్కన అలాగే ఖాళీగా ఉంచి, మరో కుర్చీలో కూర్చున్నారు. కేజ్రీవాల్ పై ఉన్న గౌరవ సూచకంగా ఖాళీ కుర్చీని పెట్టామని, వేరే కుర్చీలో కుర్చున్నట్లు పేర్కొన్నారు. దీన్ని ఆప్ అధికారికంగా విడుదల చేయటం గమనార్హం.
అయితే, ఇదంతా ఎన్నికల జిమ్మిక్కు అని… ఆప్ గ్రాఫ్ భారీగా పడిపోయిందని, ఇక గెలవలేనని తెలిసి… కేజ్రీవాల్ సెంటిమెంట్ కోసం డమ్మీ సీఎంగా అతీషిని నియమించారని, తెర వెనుక నడిపించేది అంతా కేజ్రీవాలే అంటూ బీజేపీ మండిపడుతోంది.