తమిళ సినిమా ప్రియులకు ముఖ్యగమనిక…
మీరు ఎదురుచూస్తున్న తమిళ రుద్రమదేవి
వారంరోజుల ఆలస్యంగా వచ్చుచున్నది.
టింగ్..టింగ్…టింగ్… సినిమా ప్రకటన విన్నారు.
ఇది వినగానే తమిళ ప్రేక్షకులు కాస్తంత నీరసపడవచ్చు. కానీ అనివార్యం. బహుభాషల్లో రిలీజ్ చేయడానికి రుద్రమదేవి యూనిట్ అన్నిఏర్పాట్లు చేసినప్పటికీ, తమిళ వర్షెన్ మాత్రం అక్టోబర్ 9వ తేదీన కాకుండా, వారం రోజుల తర్వాత అంటే అక్టోబర్ 16 శుక్రవారం రిలీజ్ చేయాలనుకుంటున్నారు. కాకతీయరాణి రుద్రమదేవి చారిత్రిక కథ ఆధారంగా దర్శక, నిర్మాత గుణశేఖర్ ఈ చిత్రాన్ని అత్యాధునిక సాంకేతిక హంగులతో శుక్రవారం రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సినిమా రిలీజింగ్ విషయంలో అనేకసార్లు వాయిదావేయాల్సివచ్చింది. రుద్రమదేవిని 3డి లో ప్రేక్షకులకు అందించాలన్న ఏకైక తపన వల్లనే ఏడాదికిపైగానే రిలీజింగ్ లో ఆలస్యమైంది. ఈ విషయం గుణశేఖర్ స్వయంగా ఒప్పుకున్నారు. ప్రతిసినిమాలో ఏదో విధంగా సరికొత్త సాంకేతిక విలువలు చూపించాలని ప్రయత్నించే అతితక్కువ దర్శకుల్లో గుణశేఖర్ ఒకరు. అందుకోసం ప్రాజెక్ట్ ఆలస్యంగా నడుస్తున్నా ఆయన పట్టించుకోరు. నాణ్యత విషయంలో రాజీపడని మనస్తత్వం ఆయనది.
ఇక ఇప్పుడు తమిళ వర్షెన్ వారం రోజుల ఆలస్యానికి మాత్రం గుణశేఖర్ కారణంకాదు. ఇది కేవలం తమిళ బాక్సాఫీస్ కారణంగానే వాయిదా పడింది. అక్టోబర్ 9 శుక్రవారం తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తారు. కానీ అదే సమయానికి తమిళవర్షెన్ కూడా రిలీజ్ చేస్తే ఈ మధ్యనే రిలీజ్ అయిన పులి (విజయ్ చిత్రం)తో బాక్సాఫీస్ రిటర్న్స్ పంచుకోవాల్సివస్తుంది. ఆర్థికపరంగా చూస్తే ఇది రెండు సినిమాలకు మంచిదికాదు. అందుకే తమిళ వర్షెన్ హక్కులు తీసుకున్న తెనన్దల్ ఫిల్స్మ్ సంస్థ `రుద్రమదేవి’ని వారం తర్వాత రిలీజ్ చేయాలనుకుంటున్నది. తెనన్దల్ ఈ విషయాన్ని తన ట్విటర్ పేజీ ద్వారా తెలియజేసింది.
అనుష్క ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించింది. వీరనారిగానే కాకుండా శృంగారనాయకగా కూడా ఈ చిత్రంలో అనుష్క అందాలు ఆరబోస్తుంది. రుద్రమదేవి చరిత్ర పుస్తకాల్లో వీరనారిగానే కనబడినప్పటికీ, యవ్వన దశలోని కథను చూపించేటప్పుడు ఆమె శృంగార రసాధిదేవతగా కనిపిస్తుందని, ఇందులో ఎవ్వరూ తప్పుపట్టాల్సిన అవసరం లేదని ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు గుణశేఖర్ వివరణ ఇచ్చారు. బాహుబలి చిత్రంలో అనుష్క 50ఏళ్ల మహిళగా కనిపించడంతో కాస్తంత ఇబ్బందిపడ్డ అనుష్కా అభిమానులకు రుధ్రమదేవి చిత్రం గిలిగింతలు పెట్టబోతున్నది. చారిత్రిక ఆధారాలకు లోబడే ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ సినిమాలో అనుష్కతోపాటుగా అల్లుఅర్జున్, రానా దగ్గుబాటి, కృష్ణంరాజు తదితరులు నటించారు.