తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై ఒక్క సారిగా ఫైరయ్యారు. యూనివర్శిటీ వైస్ చాన్సలర్ల నియామకాలు జరగడం లేదంటూ ఆమె ఘాటు లేఖ రాశారు. తెలంగాణలోని 11 వర్సిటీల్లో వీసీ పోస్టులు ఖాళీ అయి.. రెండేళ్లు అవుతోంది. నియామకం కోసం 2019 జులైలోనే నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ ఇంత వరకూ ఎవర్నీ నియమించలేదు. దీనిపై కోర్టుల్లోనూ కేసులు పడ్డాయి. హఠాత్తుగా ఈ అంశంపై స్పందించిన తమిళిసై… 10 రోజుల్లోగా వీసీలను నియమించాలని ఆదేశిస్తూ లేఖ పంపారు. అప్పుడెప్పుడో కరోనా కాలంలో ప్రభుత్వం సరిగా స్పందించడం లేదని జాతీయ మీడియాకు ఇంటర్యూ ఇచ్చిన ఆమె… ఆ తర్వాత ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఓ ఘాటు లేఖ రాసి.. దాన్ని మీడియాకు కూడా విడుదల చేశారు.
బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల పాత్ర కీలకం మాత్రమే కాదు వివాదాస్పదం కూడా. దానికి బెంగార్, కేరళ సహా పలు రాష్ట్రాలు ఉదాహరణగా నిలుస్తాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలకు ఆ ఇబ్బంది లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణ సర్కార్‌తో సన్నిహితంగానూ..చంద్రబాబు సర్కార్‌తో వివాదాస్పదంగానూ వ్యవహరించేవారు. ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడిన తర్వాత రెండు రాష్ట్రాలకు వేర్వేరు గవర్నర్లను నియమించిన వారు కూడా… ఫ్రెండ్లీ గవర్నర్లుగానే ఉన్నారు. ఎక్కడా “బీజేపీ మార్క్ ” గవర్నర్లుగా వ్యవహరించలేదు. దీనికి కారణం బీజేపీ రాజకీయ వ్యూహాలే కారణం అని అనుకోవచ్చు.
అయితే ప్రస్తుతం ఏపీ సంగతేమో కానీ… తెలంగాణలో మాత్రం బీజేపీ రాజకీయాలు మార్చాలనుకుంటోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీతో ఎలాంటి లడాయి పెట్టుకోవాలనుకోవడం లేదు. కానీ బీజేపీ మాత్రం… తెలంగాణలో పాగా వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి వస్తే… బెంగాల్ లాంటి పరిస్థితి వస్తుందన్న అంచనాలతో ఉన్న కేసీఆర్ సైలెంటయ్యారు.అయితే బీజేపీ మాత్రం.. కేసీఆర్‌తో ఎలాంటి లాలూచీ ఉండదనిప్రకటనలు చేస్తున్నారు. ఆ క్రమంలో గవర్నర్ కూడా.. కాస్త ఘాటు లేఖలు రాయడం ప్రారంభించారు. ఇది ఆ కోణంలో జరుగుతోందా లేక పోతే… వీసీల నియామకం కాకపోవడం వల్ల యూనివర్శిటీలు ఇబ్బందులకు గురవుతున్నాయని.. గవర్నర్ సొంతంగా ఆవేదనకు గురై లేఖరాశారా అన్నదానిపై స్పష్టత లేదు.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా ఏం జరిగినా అది తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. టీఆర్ఎస్ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేయాలనుకుంటే.. తమిళిసై మరింత యాక్టివ్ అవడం ఖాయం అనుకోవచ్చు. ఒక వేళ బెంగాల్, కేరళ గవర్నర్లులా రాజకీయం మార్చాలనుకుంటే మాత్రం… తమిళశైని తట్టుకోవడం కేసీఆర్‌కు.. టీఆర్ఎస్కు అంత తేలిక కాదు. ఎందుకంటే… ఆమె గవర్నర్‌గా మారిన ఫైర్ బ్రాండ్ రాజకీయ నాయకురాలు. అమెకు రాజకీయం ఎలా చేయాలో తెలుసు.